24 జులై, 2012

బాబుకు మోహన్‌బాబు హ్యాండ్, జగన్‌తో వెళ్లినట్లేనా?
















హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హ్యాండిచ్చినట్లేనని అంటున్నారు. ఈ కలెక్షన్ కింగ్ మంగళవారం మధ్యాహ్నం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్‌కు జై కొట్టినట్లేనని అంటున్నారు.

జగన్ పార్టీలో చేరేందుకు మోహన్ బాబు ఆసక్తి చూపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం మోహన్ బాబు తిరుపతిలోని తన శాంతినికేతన్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారు. అంతేకాకుండా తామిద్దరం ఎవరి పనుల్లో వాళ్లం బిజీ అయిపోయి ఎవరికి వాళ్లంగా ఉన్నామని, ఇక నుండి ఇద్దరం కలిసి పని చేస్తామని చంద్రబాబు చెప్పగా, మోహన్ బాబు కూడా దాదాపు అలాంటి వ్యాఖ్యల చేశారు.

దీంతో అతను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగింది. బాబుతో విభేదాలు సమసి పోయిన, నందమూరి బాలకృష్ణతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని భావించారు. అయితే ఆ తర్వాత జగన్... మోహన్ బాబు ఇంటికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మంచు విష్ణుకు కవలలు పుట్టినందు వల్ల శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చారని, కేవలం బంధుత్వం కారణంగానే కలిశామని చెప్పారు.

తాజాగా మంగళవారం జైలులో జగన్‌ను కలిశారు. బాబును తన పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించన తర్వాత మోహన్ బాబు మళ్లీ ఎక్కడా అటు వైపుకు వెళుతున్నట్లుగా కనిపించలేదు. కానీ జగన్‌తో భేటీలు చూస్తుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా జగన్ వైపుకు వెళ్లేందుకే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంచల్‌గూడ జైలు వద్ద మోహన్ బాబు మాట్లాడుతూ.. జగన్ జైలు జీవితంపై ఆవేదన వ్యక్తం చేశారు.

తాను తన మేనల్లుడిని కలిశానని, గుండె బరువెక్కిందని చెబుతూ.. అతని అరెస్టుపై ఢిల్లీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని మహాభారతంలో శకునితో పోల్చారు. బంధుత్వం నేపథ్యంలో జగన్‌ను కలిసినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయాల పరంగా స్పందించడం, కాంగ్రెసు నేతలపై విమర్సలు చేయడం మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లే సంకేతాలే అంటున్నారు. జగన్ వైపు వెళ్లినట్లేనా అనే చర్చ రాజకీయ నేతల్లో కూడా జోరుగా జరుగుతోంది. మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు తాను ఏ పార్టీలో చేరేది స్పష్టంగా వెల్లడించలేదు.

మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి బాలకృష్ణ

























హైదరాబాద్: మా అబ్బాయి మోక్షజ్ఞ కచ్చితంగా హీరో అవుతాడు. అయితే వేరే దారి లేక కాదు. తనకు సినిమాలంటే ఇంట్రస్ట్ ఉంది. అప్పట్లో నన్ను నాన్నగారు బలవంతంగా సినిమాల్లోకి నెట్టలేదు. నా ఆసక్తి గమనించి ప్రోత్సహించారు. ఇప్పుడు నేనూ అంతే అంటూ తన కుమారుడు సినీ ప్రవేశం గురించి మీడియాకు తెలియచేసారు బాలకృష్ణ. ఆయన తన తాజా చిత్రం ఊ కొడతారా...ఉలిక్కి పడతారా ప్రమేషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.

అలాగే మల్టీస్టారర్ చిత్రాల గురించి మాట్లాడుతూ... ‘ఊ కొడతారా..' మల్టీస్టారర్ కిందే లెక్క. నేను, మనోజ్, శివాజీగారి అబ్బాయి ప్రభు, సుహాసిని, లక్ష్మీప్రసన్న, సోనూసూద్... ఇలా చాలామంది యాక్ట్ చేశాం. మల్టీస్టారర్ సినిమాలు చేసేయాలనే ఆరాటంతో చేయడం కరెక్ట్ కాదు. కథ, పాత్రలు సరిగ్గా కుదిరినప్పుడే చెయ్యాలి. నాన్నగారు, నాగేశ్వరరావుగారు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు చూసినప్పుడు ఎందుకు చేశారా? అనిపిస్తుంది. అందుకని మంచి కథ, పాత్ర కుదిరితేనే మల్టీస్టారర్ చేస్తాను అన్నారు.

‘ఊ కొడతారా..' చిత్రంపై ప్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ గురించి చెపుతూ...ఈ సినిమా గురించి విన్న తర్వాత అభిమానులు ఊ... అనే విధంగా స్పందించారు. ఇందులో నటించడం అంత అవసరమా? అని కూడా అనుకున్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. కాబట్టి సినిమా చూసేటప్పుడు ముందు ఉలిక్కిపడి ఆ తర్వాత బలంగా ఊ అంటారు. అభిమానులే కాదు, ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని చెప్పారు.

స్టార్ హీరోగా ఓ హోదా లో ఉంటూ ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా'లో కీలక పాత్ర చేయడానికి గల కారణం వివరిస్తూ...ఇందులో నేను చేసినది వైవిధ్యభరితమైన పాత్ర. ఈ కథ, పాత్ర నచ్చడంవల్ల చేశాను. ఈ రోల్‌ని ఎంజాయ్ చేస్తూ చేశాను. మామూలుగా నేను ఒక పాత్రను సొంతం చేసుకున్న తర్వాత, అందులోకి పూర్తిగా ఒదిగిపోతాను. ఈ చిత్రంలోని పాత్రలో కూడా అలాగే మౌల్డ్ అయ్యాను. ఇది మంచి పాత్ర కాబట్టి నటుడిగా పూర్తి సంతృప్తి లభించిందని మాత్రం చెప్పను. ఎన్ని వందల పాత్రలు చేసినా కళాకారులకు సంతృప్తి అనేది లభించదు అన్నారు.

బాలకృష్ణ ముఖ్య పాత్రలో మనోజ్, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' ఈ నెల 27న విడుదల కానుంది. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.

కేవలం రాజమౌళి ఫోటోతో ప్రభాస్ చిత్రం












చెన్నై: ‘ఈగ' చిత్రం తమళ్ డబ్బింగ్ ‘నాన్ ఈ' హిట్టుతో తమిళనాట రాజమౌళికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన చిత్రాల డబ్బింగ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అందులో భాగంగా ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. అయితే పబ్లిసిటీలో మాత్రం ఎక్కడా ప్రబాస్ ఫోటోలు వాడటం లేదు. కేవలం రాజమౌళి ఫోటనే వేసి.. ఆయన పేరులోని మౌళి అనేది తీసుకుని పెట్టి క్రేజ్ తేవాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రభాస్, శ్రియ జంటగా నటించిన ‘ఛత్రపతి' తమిళ్ తెరకు వెళ్లనుంది. రాజమౌళి పేరు వచ్చేట్లుగా ‘చ్రందమౌళి' అని ఈ చిత్రానికి పేరు పెట్టడం విశేషం. అది మాత్రమే కాదు.. సినిమాలో నటించిన నటీనటుల ఫొటోలతో కాకుండా పోస్టర్లలో రాజమౌళి ఫొటోలనే వాడుతున్నారు. ఇటీవల రాజమౌళి ఫొటోతో పోస్టర్లు ముద్రించి విడుదల చేశారు ఈ చిత్రాన్ని అనువదిస్తున్న నిర్మాత సతీష్.

తమిళంలో విడుదల కానున్న సినిమా పోస్టర్‌పై తెలుగు దర్శకుడి బొమ్మని ఉపయోగించారంటే రాజమౌళికి పరభాషలో ఎంత క్రేజ్ వచ్చిందో ఊహించవచ్చు. ప్రస్తుతం ‘చంద్రమౌళి' అనువాద పనులు జరుగుతున్నాయి. సతీష్ ఫిలిం కార్పొరేషన్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు సతీష్. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా పడుతుందని అంటున్నారు. పబ్లిసిటీ కూడా ‘నాన్ ఈ' దర్శకుడు మరో అద్భుత సృష్టి అన్నట్లు చెప్తూ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం విజయవంతం అయితే మరిన్ని రాజమౌళి చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతాయి అంటున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి మిగతా చిత్రాల డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈగ తెచ్చిన క్రేజ్ తమ చిత్రాల మార్కెటింగ్ కు ఉపయోగపడుతూండటంతో ఆ నిర్మాతలు సైతం ఆనందంగా ఉన్నారు. ఇక రాజమౌళి ఈగ చిత్రం తమిళనాడు లో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

జాన్‌ అబ్రహామ్ సరకు చేరిన దీపికా పడుకునే















స్పోర్ట్స్ బైక్‌లకు పేరుగాంచిన ప్రముఖ జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్, భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి 'యమహా రే' అనే స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్కూటర్ కోసం ప్రముఖ బాలీవుడ్ తార 'దీపికా పడుకొనే'ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీపికా పడుకొనే ఇప్పటి వరకూ వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ, ఇలా ఓ ఆటోమొబైల్ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే, యమహా మోటార్‌సైకిళ్ల బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్‌ను నియమించుకోగా, తమ స్కూటర్ల కోసం దీపికా పడుకొనేను నియమించుకుంటున్నామని కంపెనీ తెలిపింది.

ఈ తాజా ఒప్పందం ప్రకారం, యమహా స్కూటర్లకు దీపికా పడుకొనే ప్రచారకర్తగా వ్యవహరించడమే కాకుండా, వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించాల్సి ఉంటుంది. ఇండియా యమహా మోటార్ ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని అత్యంత స్టయిలిష్ లుక్, పలర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌తో యమహా రే 125సీసీ స్కూటర్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ స్కూటర్ ఉత్పత్తి దశలో ఉంది. ఈ ఏడాది దీపావళి కానుకగా యమహా రే స్కూటర్ మార్కెట్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ ఎమ్‌డి హిరోయుకి సుజుకి మాట్లాడుతూ.. తమ రే స్కూటర్ కోసం దీపికా పడుకొనేను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ఈ స్కూటర్ కూడా దీపికా మాదిరిగానే 'కూల్ అండ్ బ్యూటీ'గా ఉంటుందని, ఆమె ఈ స్కూటర్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయగలదని అన్నారు. ఇప్పటికే, జాన్ అబ్రహామ్ కారణంగా తమ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభించిందని, దీపికా పడుకునే ద్వారా కూడా ఇదే విధమైన స్పందన లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చిరంజీవి సినిమా హక్కులపై... ఆమె ఖండన
















మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర' చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం అప్పటి వరకు ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టిన ఈచిత్రం చిరంజీవి సినిమా స్టామినా ఏమిటో ఇండస్ట్రీకి రుచి చూపింది. తాజాగా ఈచిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతోందని, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నారని వార్తలు వినిపించాయి.

ఇది వరకు తెలుగు విక్రమార్కుడు రీమేక్ హక్కులు దక్కించుకుని అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్' చిత్రాన్ని నిర్మించిన సంజయ్ లీలా బన్సాలీ....ఈ సారి ఇంద్ర చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని, ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం.

అయితే ఈ వార్తలను ఇంద్ర చిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కుమార్తె....ప్రియాంక దత్ ఖండించారు. ‘ఇంద్ర' చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఎవరికీ అమ్మలేదని స్పష్టం చేశారు. తామే ఈచిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నామని, హక్కులు ఎవరికీ అమ్మబోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అశ్వినీదత్ తన వై జయంతి మూవీస్ బేనర్‌పై రవితేజ హీరోగా ‘సార్ వస్తారా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు మహేష్, క్రిష్ కాంబినేషన్లో కూడా అశ్వినీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన ‘రాజకుమారుడు' సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందింది. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసే ప్లాన్ చేస్తున్నారు.

19 జులై, 2012

వావ్..జూ ఎన్టీఆర్ 7 స్టైల్స్!





















యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఇటీవల ఓ ప్రెస్ మీట్లో సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించిన విషయం తెలిసిందే. జూనియర్ కర్లింగ్ హెయిర్ కాస్త సాఫ్ట్ హెయిర్‌లా తయారైంది. అదంతా కూడా అతను నటిస్తున్న ‘బాద్ షా' చిత్రం షూటింగులో భాగంగా చేసిన మేకప్ స్టైల్. తాజాగా సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ఏమిటంటే జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో 7 సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడట.

కొన్ని పాటల్లో...కొన్నీ సీన్లలో జూనియర్ ఈ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు.

శ్రీను వైట్ల దర్వకత్వంలో రూపొందుతున్న ‘బాద్ షా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటీలీలోని మిలన్‌లో జరుగుతోంది. మరో 25 రోజుల పాటు ఇటలీలోనే షూటింగ్ జరుగనుంది. జూనియర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి గోపీమోహన్, కోన వెంకట్ అద్భుతమైన స్క్రిప్టు అందించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

మహేష్ బాబు సినిమా దూరం దూరం!

























మహేష్ బాబు, వెంకటేష్ నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రోజులు గడిచే కొద్దీ మరింత దూరం దూరం అవుతోంది. సినిమా విడుదల దసరానాటికి అందుబాటులోకి వస్తుందని అనుకుంటే మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మధ్య ఈచిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సెప్టెంబర్లో విడుదల సాధ్యం కాదని తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా ఈచిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా, వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి రొమాన్స్ చేస్తోంది.

పూర్తి కుటుంబ కథా చిత్రం రూపొందుతున్న ఈచిత్రం మహేష్ బాబు గత సినిమాలకు భిన్నంగా... మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను మెప్పించేలా అన్ని చిత్రీకరిస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం ప్రేక్షుకుల తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

కార్లో లిఫ్ట్ ఇచ్చిన కాలేజ్ అమ్మాయికి ముద్దులు, అరెస్ట్

















చెన్నై: తన కారులో లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయిని బలవంతంగా కౌగిలించుకొని, కిస్ చేసినందుకు ఓ యువకుడిని తమిళనాడులోని అద్యార్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాషర్‌మెన్‌పేటకు చెందిన ఇరవై రెండేళ్ల కాలేజ్ అమ్మాయి రెండు రోజుల క్రితం కొత్తగా కొన్న తన కారులో వెళుతుండగా కస్తూరిబాయి నగర్‌లోని థర్డ్ క్రాస్ వీధి వద్దకు వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది.

దీంతో కారు ఆగిపోయింది. కారు స్టార్ట్ అవుతుందేమోనని ఆమె ప్రయత్నించింది. పక్కనే నిలబడిన ఇరవై నాలుగేళ్ల రాజ మోహన్ ఆమె కారును స్టార్ట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాడు. ఇతనో క్యాబ్ డ్రైవర్. ఏదైనా సహాయం కావాలా అని అమ్మాయిని అడిగాడు. ఆయన మాటలను నమ్మిన ఆ అమ్మాయి కారులో పెట్రోల్ అయిపోయిందని, పోయించడానికి దగ్గరలో బంక్ లేదని చెప్పింది.

తాను వెళ్లి తీసుకు వస్తానని చెప్పిన రాజ మోహన్ దగ్గరలో ఉన్న బంక్ వద్దకు వెళ్లి ఓ బాటిల్‌లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆమె కారులో పెట్రోల్ పోసిన అనంతరం తన కారును ఇక్కడే దగ్గరలో పార్క్ చేశానని, అక్కడ వరకు తనకు లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ఆ అమ్మాయిని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది. అతను కారులోని వెనుక సీట్లో కూర్చున్నాడు. వెనుక సీట్లో కూర్చున్న రాజ మోహన్ హఠాత్తుగా తనను వెనుక నుండి కౌగిలించుకొని తనపై ముద్దుల వర్షం కురిపించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

రాజ మోహన్ చర్యలతో నిశ్చేష్టురాలైన అమ్మాయి ఒక్కసారిగా అరవడం ప్రారంభించింది. ఇది గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి అద్యార్ పోలీసులకు అప్పగించారు. బాధిత అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజ మోహన్‌ను అరెస్టు చేశారు. ఇతనిని జ్యూడిషియల్ రిమాండుకు పంపించారు. ఇతను తిరువూర్‌కు చెందిన వ్యక్తి.

18 జులై, 2012

ప్రభుదేవాకు నో చెప్పిన త్రిష?



















అక్షయ్ కుమార్‌తో ‘కట్టా మీటా' అనే బాలీవుడ్ సినిమా చేసిన తర్వాత అక్కడ ఆశించిన ఫలితాలు కనిపించక పోవడంతో హీరోయిన్ త్రిష మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టి ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇప్పుడు ఆమెకు పలు హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నా చేసే సమయం లేక రిజక్ట్ చేస్తోంది.

తమిళ సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం కె.ఎస్. రవికుమార్ తమిళంలో రూపొందించి ‘సామి' చిత్రాన్ని సంజయ్ దత్ హీరోగా హిందీలో రూపొందించాలని ప్లాన్ చేశారు. ఇందులో సంజయ్‌కి జంటగా త్రిషను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమెను సంప్రదించినా డేట్స్ ఖాళీ లేవని నో చెప్పింది.

డాన్స్ మాస్టర్ నుంచి డైరెక్టర్‌గా మారిన ప్రభుదేవా ఆ మధ్య తెలుగులో రూపొందించిన చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటా'. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న ప్రభుదేవా ఆ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో హీరోయిన్‌‍గా త్రిష అయితేనే కరెక్ట్ అని ఆమెను అడగ్గా....ప్రస్తుతం తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల సాధ్యం కాదని తేల్చి చెప్పిందట.

త్రిష నో చెప్పడంతో ప్రభుదేవా మరో సౌత్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హిందీలో కుమార్ తౌరాని నిర్మించడానికి ముందుకు వచ్చాడు. తౌరాని తనయుడు క్రిష్ హీరోగా నటించనున్నాడు.

గూగుల్ నుండి యాహూ సీఈవోగా 'మారిసా మేయర్'



















శాన్ ఫ్రాన్సికో, జులై 17: గూగుల్ మొట్టమొదటి మహిళా ఇంజనీర్ మారిసా మేయర్ యాహూ కొత్త ప్రెసిడెంట్, సీఈవోగా గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్ నియమితులయ్యారు. ప్రస్తుతం యాహు తాత్కాలకి సిఈవోగా వ్యవహరిస్తున్న రాస్ లెవిన్సన్ స్దానంలో జులై 17 నుండి మారిసా మేయర్ బాధ్యతలను చేపట్టనున్నారు. గూగుల్, ఫేస్ బుక్ నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సందర్బంలో 37 సంవత్సరాల వయసు కలిగిన మారిసా మేయర్ నియామకం యాహూకి అన్ని విధాలా కలిసి వస్తుందని యాహూ భావిస్తుంది.

ఇక మారిసా మేయర్ విషయానికి వస్తే విస్కాన్సిన్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో సైన్సు మీద ఉన్న ప్రేమతో ఆ రాష్ట్ర గవర్నర్ ద్వారా ఎంచుకున్న జాతీయ యూత్ సైన్స్ క్యాంప్‌కు ప్రాతినిధ్యం వహించింది. సిలికాన్ వ్యాలీలో ఉన్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్‌లో సింబాలిక్ సిస్టమ్స్ పై బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్స్‌లో మాస్టర్స్ డిగ్రీని సాధించింది. తన క్లాస్ మేట్స్ లారీ పేజి, సెర్జీ బ్రిన్‌తో కలిసి 1999లో గూగుల్ కంపెనీలో చేరిన మొదటి మహిళా ఇంజనీర్.

లారీ పేజి గూగుల్ వీడ్కోలు సభలో మాట్లాడుతూ 13 సంవత్సరాల క్రితం 20వ నెంబర్ ఉద్యోగిగా చేరిన మారిసా మేయర్ గూగుల్ వినియోగదారులకు అలసిపోకుండా తన సేవలను అందించిన ఛాంపియన్ అంటూ కొనియాడారు. గూగుల్ శోధన, జియో, మరియు స్థానిక ఉత్పత్తుల కోసం మారిసా మేయర్ ఎంతగానో వాటి అభివృద్ధి దోహదపడింది. గూగుల్ కంపెనీలో ఆమె టాలెంట్‌ని మిస్ అవుతున్నాం అని అన్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గూగుల్ ఫీచర్స్ సెర్చ్ ఇంజన్, హోం పేజిని ఒక రూపుకి తీసుకువచ్చింది మారిసా మేయర్ కావడం విశేషం. ఇటీవల కాలంలో మారిసా మేయర్ లోకల్, మ్యాప్స్, లోకేషన్ సర్వీసెస్, లోకల్ మరియు భౌగోళిక ఉత్పత్తులకు నిలయమైన ఇంటర్నెట్ గెయింట్ ఉత్పత్తులు జగత్ రెస్టారెంట్ రివ్యూలతో పాటు స్ట్రీట్ వివ్ తదితర కొత్త టెక్నాలజీల అభివృద్ది మారిసా మేయర్ నిర్వహాణలో జరిగాయన్నారు.

గూగుల్‌లో చేరక ముందు మారిసా మేయర్ జురిచ్‌, స్విట్జర్లాండ్‌లో ఉన్న UBS research lab (Ubilab) మరియు కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ లో SRI International పని చేశారు. దీనితో పాటు తాను చదువుకున్న స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీలో కంప్యూటర్ ప్రొగ్రామింగ్‌ని కొన్నాళ్లు బోధించారు.

గతయేడాది బిజినెస్ రంగంలో ('40 under (age) 40')40 సంవత్సరాలకు లోబడి పైకి ఎదుగుతున్న స్టార్స్‌లలో ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్స్ బర్గ్, ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ దోర్సే లతో పాటు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మారిసా మేయర్‌కి గ్లామరస్ మ్యాగజైన్ 'ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు' లాంటి అవార్డుతో పాటు, ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో యంగ్ గ్లోబర్ లీడర్‌గా అనువదించబడింది. నాలుగు సంవత్సరాల పాటు వరుసగా ఫార్చూన్ పత్రిక ప్రకటించిన టాప్ 50 మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ జాబితాలో స్దానం దక్కించుకున్నారు.

లేడీ నిత్యానందగా...షకీలా




















శృంగార తార షకీలా సినిమాలంటే అంటే ఇప్పటికీ ఓ వర్గం ప్రేక్షకులు పడి చస్తారు. ఆ...సినిమా చేయడం మనేసినప్పటికీ తరచూ మామూలు చిత్రాల్లో మసాలా పాత్రలు పోషిస్తూనే వస్తోంది. ఆమె సెక్స్ సినిమాలకు పులిస్టాప్ పెట్టినా దర్శకులు మాత్రం ఆమెను అలాంటి చిన్న చిన్న కామెడీ పాత్రలకే వాడుకుంటున్నారు.

తాజాగా ఆమె ఓ మళయాల చిత్రంలో గాడ్ ఉమన్(ఆడ స్వామిజీ) పాత్రను పోషిస్తుందని, ఆమె పాత్ర సెక్స్ స్వామిగా ముద్ర పడ్డ నిత్యానందను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్ర భక్తులను మోసం చేస్తూ...వారికి డ్రగ్స్ అలవాటు చేసి తన దాసులను చేసుకునేలా ఉంటుందని, తన దగ్గరికి వచ్చే భక్తులకు తన ఆశీస్సుల ఇవ్వడానికి బీర్ బాటిల్స్ నైవేద్యంగా తెప్పించుకుంటుందని, ఈ పాత్ర చాలా ఫన్నీగా, అదే విధంగా యమ హాట్ గా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రంలో షకీల చాలా బోల్డ్‌గా నటించిందని, సెన్సార్ బోర్డు వారు ఆమె నటించిన సీన్లకు 10 చోట్ల కత్తెర పెట్టారని మాలీవుడ్ టాక్. త్వరలో ఈచిత్రం తమిళం, మళయాలంలో విడుదల కానుంది. తెలుగులో ఈచిత్రం ‘ఆసామి' పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం షకీలా ఉందనే కారణంతోనే ఈచిత్రాన్ని మంచి రేటు పెట్టి కొంటున్నారట.

ఆయనతో పోల్చుకుంటే అత్యాశే: రాజమౌళి




















‘ఈగ' చిత్రం విడుదల అనంతరం రాజమౌళి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. రాజమౌళి ఆ సినిమా తీయడానికి చాలా సమయం తీసుకున్నా అద్భుతం సృష్టించారని అంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కొందరు...టైటానిక్, అవతార్ లాంటి గొప్ప చిత్రాలను రూపొందించిన హాలీవుడ్ గ్రేడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో పోల్చడం మొదలు పెట్టారు. తనను అలా పోల్చడంపై రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో స్పందించారు.

‘జేమ్స్ కామెరూన్ కూడా లేట్‌గా మూవీ తీస్తారని అతనితో నన్ను కంపేర్ చేయడం తప్పు. కామెరూన్‌లా తీశారని ప్రశంసిస్తే సంతోషిస్తా. అంతేకానీ అందరు అంటున్నారు కదా అని నన్ను నేను కామెరూన్‌తో పోల్చుకుంటే అత్యాశే అవుతుంది. కామెరూన్ గ్రేట్ డైరెక్టర్' అంటూ సమాధానం ఇచ్చారు రాజమౌళి.
ఈగ చిత్రం చేయడం ఒక సాహసంగా అభివర్ణించిన రాజమౌళి, మేము ఈగపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులు సినిమాకు మంచి మౌత్ టాక్ ఇవ్వడం వల్లనే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని, నేను వెళ్లిన ప్రతి టూర్లోనూ మంచి స్పందన వచ్చిందన్నారు.

ఈగ చిత్రం తర్వాత చేయబోయే చిత్రం ప్రభాస్‌తోనే అని రాజమౌళి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈగ విజయాన్ని పూర్తి ఎంజాయ్ చేశాక ఆ సినిమా మొదలుపెడతానని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని సంకేతాలు ఇచ్చారు.

సోనియా గాంధీకి క్రాస్ ఓటింగ్ భయం, అందుకే....




















న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై కొంత మంది తమ పార్టీ పార్లమెంటు సభ్యులు క్రాస్ ఓటింగుకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయకూడదని తెలంగాణ జెఎసి అన్ని పార్టీల తెలంగాణ ప్రతినిధులకు పిలుపునిచ్చింది. పార్టీకి చెందిన వీర తెలంగాణవాదులు ఆ దిశగా ఆలోచన చేస్తే ప్రమాదం ఉంటుందని సోనియా ముందుగానే జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులతో ఆమె ప్రత్యేకంగా మంగళవారం సమవేశం కావడం వెనక ఆ భయమే ఉందని అంటున్నారు. పార్లమెంటు సభ్యులు ఎలా ఉన్నారు, వారి ఆలోచన ఏ విధంగా ఉందని పరిశీలించడానికి, తాను ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లు వారిని సంతోషపెట్టడానికి సోనియా రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమైనట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుల్లో రెండు రకాల వాళ్లున్నారు.

పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి. వివేక్ వంటివారు కాంగ్రెసులో తెలంగాణ విషయంలో అతివాదులు కాగా, సర్వే సత్యనారాయణ, వి. హనుమంతరావు వంటివారు మితవాదులుగా గుర్తింపు పొందారు. తెలంగాణ సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని పొన్నం ప్రభాకర్ వంటి అతివాద గ్రూపు అంటూ వస్తోంది. సర్వే సత్యనారాయణ, హనుమంతరావు వంటివారు తెలంగాణ కావాలని గట్టిగానే అడుగుతున్నప్పటికీ పార్టీకి పూర్తి విధేయులుగా వ్యవహరిస్తున్నారు.

నిజానికి అతివాదులుగా పేరు పొందినవారు కూడా ఎప్పటికప్పుడు పార్టీకి సహకరిస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో కాస్తా ఇబ్బంది పెట్టినట్లు వ్యవహరిస్తూ మళ్లీ దారికి రావడం వారు ఒక వ్యూహంగానే పెట్టుకున్నారు. 

వారిపై సోనియాకు, ముఖ్యంగా కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నమ్మకంగానే ఉన్నారని చెబుతారు. అయితే, ఒక్కసారి వారిని పిలిచి మాట్లాడడం ద్వారా వారు సంతృప్తి చెందుతారనే ఉద్దేశంతోనే సోనియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో కూడా మాట్లాడుతూ నమూనా బ్యాలెట్ ఇచ్చి ప్రణబ్ ముఖర్జీ ప్రథమ ప్రాధమ్య ఓటు వేయాలని, రెండో ప్రాధమ్య ఓటు వేయకూడదని చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సోనియా సూచించారు.

'కెమెరామేన్ గంగతో రాంబాబు' మరో రికార్డు
















పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో పాటు, తమిళ, మళయాళ భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని దర్సక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు డబ్బింగ్, మిగతా పనులును వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా మూడు భాషల్లో విడుదల అవుతున్న పవన్ చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి ఇదో రికార్డు.

ఇక ఈ చిత్రం పద్మాలయా స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారి సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. మొన్నటివరకూ సారధిలో వేసిన మెకానిక్ షెడ్ లో సీన్స్ పూర్తి చేసారు. 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

బాలకృష్ణ 50-50 ఫార్ములా..!



















నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతానని అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళితే సినిమాలకు దూరం అవుతారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆయనకు ఇప్పుడప్పుడే సినిమాలకు దూరం అయ్యే ఆలోచన లేదని బాలయ్య సన్నిహితులు అంటున్నారు.

నెలలో సంగం రోజులు తెలుగుదేశం పార్టీ తరుపున రాజకీయాల్లో పాల్గొనేలా, మిగిలిన రోజులు సినిమా షూటింగులకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలా చేయడం వల్ల రాజకీయాల్లో ఫెయిల్ అయినా....సినిమాల ద్వారా సేఫ్ అవ్వొచ్చని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఏది ఏమైనా రెండు పడవల మీద ప్రయాణం చేయాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

బాలయ్య ప్రస్తుతం రవి చావలి దర్శకత్వంలో ‘శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. ‘మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. బాలయ్య అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అదే విధంగా తన రాజకీయ ఎంట్రీకి సపోర్టును ఇచ్చే విధంగా ఓ సినిమా చేయాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, తన తండ్రి ఎన్టీఆర్ పుట్టిన గడ్డ కావడంతో తనకు రాజకీయంగా బలాన్ని ఇస్తుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుగేదేశం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

చిరు చేతులతో ‘విశ్వ నట చక్రవర్తి’విగ్రహావిష్కరణ
















మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విశ్వనట చక్రవర్తి దివంగత ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరుగనుంది. జూలై 20వ తేదీన రాజమండ్రిలోని ధవళేశ్వరం వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అక్కడ స్పెషల్ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించగా, ఆయన సోదరుడు నాగబాబు గుంటూరులో ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. హిందూ కాలేజిలో డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు.
ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. 

నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు కన్నుమూశాడు.

తలొగ్గిన చంద్రబాబు: రాష్ట్రపతి ఎన్నికలకు దూరం
















హైదరాబాద్: తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యతిరేకిగా ప్రణబ్ ముఖర్జీని భావిస్తూ, మతతత్వ బిజెపి మద్దతిస్తున్న పిఎ సంగ్మాను బలపరచలేక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయనున్నట్లు చంద్రబాబు ఇంతకు ముందు సంకేతాలు ఇచ్చారు. అయితే, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీని బలపరచకూడదంటూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ వ్యతిరేకిగా పరిగణిస్తూ ఆయనకు ఓటు వేయకకూడదని వారు సూచించారు. వారి విజ్ఞప్తికి చంద్రబాబు తలొగ్గినట్లు చెబుతున్నారు.

ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్నామని రమేష్ రాథోడ్ చెప్పారు. అలాగే, మతతత్వ బిజెపి సమర్థిస్తున్న పిఎ సంగ్మాకు కూడా ఓటు వేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటేర్లవరూ పాల్గొనబోరని రమేష్ రాథోడ్ చెప్పారు.

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆ పార్టీ తన వైఖరిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వకూడదని తెలంగాణ జెఎసి తెలంగాణ పార్టీలను, ప్రజా ప్రతినిధులను కోరింది.

మహేష్ బాబు బంధువు మృతిపై అనుమానాలు!




















టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు శాఖమూరి సూరి బాబు అనుమానాస్పద స్థితిలో విజయవాడలో మరణించారు. సూరి బాబు మృత దేహం పశువుల ఆసుపత్రి వంతెన వద్ద కాలువలో తేలిఉంది. ఇది ఆత్మ హత్యా? లేక అనుకోకుండా జరిగిన ప్రమాదమా? ఇంకేమైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సూరి బాబు మృతి విషయం తెలుసుకున్న వెంటనే కృష్ణ కుటుంబం ఒక్క సారిగా దిగ్ర్భాంతికి గురైంది. కృష్ణ వెంటనే హుటా హుటిన సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడ బయల్దేరినట్లు తెలుస్తోంది. విజయవాడలో మాత్రం సూరి బాబు మృతిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బంధువు కావడంతో పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వీలైనంత త్వరగా ఆయన మృతి వెనక గల మిస్టరీని చేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ స్థాయి నుంచి ఈ కేసుపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

ప్రభాస్ రెబెల్ షూటింగ్ @ పొల్లాచ్చి




















హైదరాబాద్లో పలు డేర్ డెవిల్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాష్ హీరోగా నటిస్తున్న ‘రెబెల్' చిత్ర యూనిట్ తమిళనాడులోని పొల్లాచ్చి‌లో తదుపరి షెడ్యూల్ జరుపుకునేందుకు బయల్దేరి వెళ్లింది. ప్రభాస్, ఇతర నటీనటులపై అక్కడ కొన్ని సీన్లు చిత్రీకరించిన తర్వాత అంతా తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ప్రస్తుతం ‘రెబెల్' షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆగస్టుకల్లా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ పనులు కొన్ని ప్రారంభం అయ్యాయి.
తమన్నా, దీక్ష సేథ్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లారెన్స్ సంగీతం కూడా తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. మార్తాండ్.కె వెంకటేష్ ఎడిటింగ్ పనులు చూసుకుంటుండగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.

మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ప్రభాస్ అభిమానుల టేస్టుకు తగిన విధంగా రూపొందిస్తున్నారు దర్శకుడు లారెన్స్. ఈచిత్రాన్ని జె. పుల్లారావు, జె. భగవాన్ శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. చిత్రీకరణకు చాలా గ్యాప్ తీసుకున్న ఈచిత్రం మరో రెండు నెలల్లో విడుదల కానుంది.

వైయస్‌ది రికార్డ్: విజయమ్మ, ప్రభుత్వంపై మండిపాటు



















విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రజలపై భారం మోపకుండా పరిపాలన చేశారని, ఇది దేశంలోనే ఒక రికార్డ్ అని, ఇప్పటి వరకు ఎవరూ అలా పాలన చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విజయమ్మ విజయవాడలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారని విమర్శించారు. వైయస్సార్ పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో పెట్టడం దారుణమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పథకాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, పేరేదైనా ప్రజలకు మేలు చేస్తే చాలన్నారు. ప్రజల మధ్య గడుపుతున్న జగన్‌ను ఉప ఎన్నికలకు ముందు సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే కారణాలతో జైలుకు పంపించారన్నారు.

జగన్ త్వరలో బయటకు వస్తారని, మళ్లీ మీ మధ్యలోనే ఉంటారని చెప్పారు. ఒక మంచి ముఖ్యమంత్రిగా వైయస్‌ను జగన్ మరిపిస్తాడన్నారు. వైయస్ ప్రతి సంక్షేమ పథకాన్ని జగన్ అమలుపరుస్తాడని స్పష్టం చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కరెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం ఆసుపత్రులలో కూడా విద్యుత్ లేని పరిస్థితి ఉందన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పల్లెల్లో తాగునీటికి తీవ్ర కొరత ఉందన్నారు. పల్లెల్లో భారీగా విద్యుత్ కోత ఉందన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి రైతు కష్టాలు తెలుసునని, ఆయన నిత్యం రైతులను పైకి తీసుకు వచ్చేందుకు తపన పడ్డాడని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళల సాధికారత కోసం ఫీజు రీయింబర్సుమెంట్స్, పావలా వడ్డీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వైయస్ రైతు బిడ్డ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ముఖ్యమంత్రి కూడా వైయస్ చేసినంతగా చేయలేదన్నారు. వైయస్ ఒక్క రూపాయి పన్ను పెంచకుండా పరిపాలన చేశారన్నారు. దేశంలోనే ఇది రికార్డ్ అన్నారు. రైతులకు 15వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నారు.

ప్రభుత్వం ఇప్పుడు తొమ్మిది గంటలు కాదు కదా మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం మూసివేత దిశగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు. రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలంటే వైయస్ వంటి నాయకులు రావాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ ఛార్జీలు పలుమార్లు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రజలు బాబు హయాంలో మళ్లీ ఇప్పుడు కాంగ్రెసు హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.