బెంగళూరు: ఓఎంసిలో అరెస్టైన కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, తాను 2009 ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి చెందిన నేతకు ఎన్నికల ఖర్చుకు కోసం భారీ మొత్తాన్ని ముట్టచెప్పినట్లుగా సిబిఐ దర్యాఫ్తులో చెప్పినట్లుగా తెలుస్తోంది. గాలి, ఆయన పిఏ అలీఖాన్ ను సిబిఐ అధికారులు మంగళవారం విచారించారు. వారిని ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ఆరేడు గంటల పాటు విచారించారని సమాచారం. విచారణలో.. వారు ఎపి నేతకు ఎన్నికల సమయంలో భారీగా డబ్బు ఇచ్చినట్లు చెప్పారని తెలుస్తోంది. తదుపరి కర్నాటకలో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలుపు కోసమూ రూ.5 కోట్లు విరాళంగా చెల్లించినట్లు చెప్పారని తెలుస్తోంది. మరో పార్టీ జాతీయ నాయకుడికి సండూరు వద్ద 30 ఎకరాల గనిని కానుకగా సమర్పించినట్లు పేర్కొన్నారని తెలుస్తోంది. దాని నుంచి లభించే మొత్తాన్ని ప్రతి నెలా రూ.3 నుండి ఐదు కోట్ల వరకూ ఆయనకు చెల్లించే వాడినని చెప్పినట్లు తెలుస్తోంది. 2008 విధాన సభ ఎన్నికల తర్వాత కర్నాటకలో విధాన సభ సభ్యుల ఫిరాయింపులు, ఉప ఎన్నికల నిర్వహణకు అయి ఖర్చులో అధిక మొత్తాన్ని తానే భరించానని చెప్పారని తెలుస్తోంది.
కాగా ఖర్చుల్లో అసోసియేటెడ్ గనుల సంస్థ అక్రమాలపై విచారణ కోసం బళ్లారి జిల్లా సండూరు, రాంఘడ్ తదితర ప్రదేశాలకు జనార్ధన్ రెడ్డిని తీసుకు వెళ్లే యోచనను శాంతిభద్రతల దృష్ట్యా విరమించుకున్నారు. మరోవైపు గాలి... సిబిఐ తనపై చేస్తున్న దర్యాఫ్తును రద్దు చేయాలని కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను న్యాయమూర్తి వచ్చే వారానికి వాయిదా వేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి