8 మార్చి, 2012

యుపిలో అఖిలేష్ యాదవ్, ఎపిలో లోకేష్ కుమార్?

                                                     Akilesh - Lokesh
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అఖిలేష్ నామస్మరణతో మారు మోగిపోయింది. ఎస్పీని గెలిపించడంలో అఖిలేష్ పాత్రనే ప్రధానమైనదని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. పార్టీలో రౌడీలకు టిక్కెట్లను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించడం నుండి గతంలో చేసిన తప్పులు పునరావృతం కానివ్వమని చెప్పడం, మంచి మానిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకు వెళ్లడమే కాకుండా... దానిని ఖచ్చితంగా అమలు చేస్తామని వారికి విశ్వాసం కలిగించడం, తాము అధికారంలోకి వచ్చినా బిఎస్పీ అధినేత్రి మాయావతి విగ్రహాలను కూల్చమని చెప్పడం, విపక్షాలపై విపరీతమైన విమర్శలు చేయక పోవడం వరకు ఇవన్నీ కలిస్తే అఖిలేష్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ అనుభవం కన్నా అఖిలేష్ తీరు ప్రజలను బాగా ఆకర్షించిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎస్పీ గెలుపు క్రెడిట్ అంతా అఖిలేష్‌కే దక్కింది. అయితే యుపిలో ఎస్పీ గెలిస్తే మన రాష్ట్రంలో టిడిపిలో ఆనందోత్సహాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకోసం వారు కోసం వారు కొన్ని పోలికలు తీసుకు వస్తున్నారు.

అక్కడా సైకిల్ గెలిచిందని 2014లో ఇక్కడా సైకిల్ హవా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ములాయం సింగ్ యాదవ్ తన హయాంలో తాను చేసిన పొరపాట్లకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. కల్యాణ్ సింగ్‌తో కలవడంపై క్షమాపణలు కోరారు. ఇక అఖిలేష్ 2008లో పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ప్రక్షాళణ ప్రారంభించారు. నాలుగేళ్లుగా అఖిలేష్‌ను ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. తండ్రి హయాంలోని తప్పులను ఆయన పునరావృతం కానివ్వబోమని చెప్పారు. ఇవన్నీ ప్రజలను మెప్పించాయి. అలాగే బాబు కూడా తన హయాంలో జరిగిన తప్పులకు బహిరంగంగా చింతిస్తున్నారు. ఇక మిగిలింది అక్కడి అఖిలేష్ మాదిరి ఇక్కడ ఓ యువనేత టిడిపిలోకి రావడమే మిగిలి ఉంది. అయితే గతంలో లోకేష్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి చంద్రబాబు విఫలమయ్యారు.

అయితే యుపి ఫలితాల నేపథ్యంలో లోకేష్ కుమార్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయిస్తే టిడిపికి 2014లో లాభిస్తుందని లేదంటే ఆ పార్టీకి తీవ్ర నష్టమని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంకా రాజకీయ అనుభవం లేదని హరికృష్ణ ఇప్పటికే చెప్పినందు వల్ల లోకేష్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. బాబు ప్రత్యర్థి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ఈ విషయమై సలహా ఇచ్చారు. యుపిలో అఖిలేష్ మాదిరి ఇక్కడ లోకేష్ ను బాబు తీసుకు వస్తేనే 2014లో కనీసం టిడిపికి డిపాజిట్ దక్కుతుందని లేదంటే అది కూడా రాదని ఎద్దేవా చేశారు. అయితే బాబు లోకేష్ పై పెదవి విప్పకపోవడం గమనార్హం. లోకేష్ రావాల్సిన అవసరమేముందని ఇప్పటికే బాలకృష్ణ యువతలో ఉత్సాహం నింపుతున్నారని, ఆయన ఇమేజ్ 2014లో పార్టీకి బాగా లాభిస్తుందని మరికొందరు అంటున్నారు.

కామెంట్‌లు లేవు: