7 మార్చి, 2012

సైకిల్‌కు తుప్పు పట్టింది, కదలదు: తెలుగుదేశంపై సిఎం

                            Kiran Kumar Reddy
హైదరాబాద్: మన రాష్ట్రంలో సైకిల్‌కు తుప్పు పట్టిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ గుర్తుతో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతిస్పందిస్తూ తమ పార్టీ సైకిల్ కూడా రాష్ట్రంలో విజయ ఢంకా మోగిస్తుందని అనడంపై ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యాఖ్యానించారు. టిడిపి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదని, రాష్ట్రంలో సైకిల్‌కు తుప్పు పట్టిందని, అది కదలదని ఆయన అన్నారు. ఎవరు ఎక్కుడ కూర్చోవాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. జయాపజయాలు ఓటర్లే బాధ్యులని ఆయన అన్నారు. 

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రతిస్పందిస్తూ - కాంగ్రెసు ఓడిపోలేదని, తాత్కాలికంగా వెనక్కి తగ్గిందని, కాంగ్రెసు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కుందని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై పడదని ఆయన అభిప్రాయపడ్డారు. మరో 17 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు త్వరలోనే అభ్యర్థులను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు ఉప ఎన్నికలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉంటేనే విజయం సాధిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసినా పార్టీ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లకపోతే విజయం సాధించడం కష్టమని ఆయన అన్నారు. 

రాహుల్ గాంధీకి ఇది నేర్చుకునే సమయమేనని ఆయన అన్నారు. ఓటమిని విశ్లేషించుకుని 2014 ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకుంటామని ఆయన అన్నారు. ప్రజలను మెప్పించేలా పనిచేయడం అవసరమని ఆయన అన్నారు. ఎన్నికల సమయానికి పరిస్థితులను బట్టి ప్రజలు ఓట్లేస్తారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో 3 - 4 స్థానాల్లో విజయానికి చేరువగా ఉన్నామని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు: