7 మార్చి, 2012

నటిపై ఫిర్యాదు చేసిన పాపానికి ఓ మహిళను పోలీసులు లాకప్‌లోకి నెట్టిన వైనం

                                          Aarthi Chabria


ముంబై: ఓ నటిపై ఫిర్యాదు చేసిన పాపానికి ఓ మహిళను పోలీసులు లాకప్‌లోకి నెట్టిన వైనం వివాదంగా మారింది. దానిపై ఆ మహిళ న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. దక్షిణ ముంబైలో నివసిస్తున్న ఆ మహిళకు రూ.2.75 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బొంబాయి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన పొరుగున నివసించే బాలీవుడ్ నటి ఆర్తి ఛాబ్రియాపై తాను ఇచ్చిన ఫిర్యాదు ఏమైందని అడగడానికి వెళ్లిన 49 ఏళ్ల వీణా సిప్పీ అనే మహిళను మూడేళ్ల క్రితం పోలీసులు లాకప్‌లో తోసేశారు. 

ఆజాద్ మైదాన్ పోలీసులు స్టేషనులో మహిళను అక్రమంగా నిర్బంధించిన తీరు తమను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2008లోని ఈ అక్రమ నిర్బంధంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, స్వేచ్ఛలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. 

తన కేసును సిప్పీ తానే వాదించుకుంది. కోర్టుకు ఆమె 22 సార్లు హాజరైంది. ఆమెను నిర్బంధించిన పోలీసాఫీసర్ల నుంచి వసూలు చేసి ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికో తోడు సివిల్ కేసు దాఖలు చేయడానికి సిప్పీకి అనుమతి ఇచ్చింది. బాలీవుడ్ నటి ఆర్తి ఛాబ్రియాతో వివాదం సిప్పీని కష్టాల పాలు చేసింది.

కామెంట్‌లు లేవు: