6 మార్చి, 2012

ఆనటి ఆత్మహత్య యత్నం వెనక...?

                                                Alphonsa
నటి, ఐటం గర్ల్ అల్ఫాన్సా సోమవారం ఆత్మ హత్యా యత్నానికి పాల్పడింది. నిద్రమాత్రలు తీసుకుని ఆత్మ హత్యకు ప్రయత్నించిన ఆమె చెన్నైలోని విజయ ఆసుపత్రిలో ఉంది. పరిస్ధితి సీరియస్ గానే ఉందని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే...ఆమె ఇంట్లో వర్ధమాన నటుడు, ఆమె ప్రియుడు వినోద్‌కుమార్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనతో అల్ఫాన్సా సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే వినోద్‌కుమార్‌ను అల్ఫాన్సా, ఆమె సోదరుడు రాబర్ట్ హతమార్చి, నాటకం ఆడుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తతో ఏర్పడ్డ అభిప్రాయ భేదాలతో ముంబై నుంచి చెన్నై చేరిన ఈమె విరుగం బాక్కం శ్యామలా గార్డెన్‌లోని బహుళ అంతస్తుల భవనంలో తన సోదరుడు రాబర్ట్‌తో కలసి నివాసం ఉంటోంది. అయితే కొంత కాలం క్రితం పరిచయమైన వినోద్‌కుమార్(25)తో ఆమె ప్రేమ వ్యవహారం మొదలైంది. వీరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు ఝూమున వినోద్‌కుమార్ తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ విరుగంబాక్కం పోలీసులకు అల్ఫాన్సా ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రాయపేట మార్చురీకి తరలించారు. 
అప్పటికే ఇంట్లో ఉన్న నిద్రమాత్రలు మింగి అల్ఫాన్సా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా కల్పాకం పుదుపట్టినం అరుమైనగర్‌కు చెందిన సుకుమార్, మృతుడి మిత్రుడు జులియట్ సీజర్ వినోద్‌కుమార్‌ది ఆత్మహత్య కాదంటూ విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బావమరిది పాండియన్‌కుమార్ కుమారుడైన వినోద్‌కుమార్ అలియాస్ సాయి ఆర్థికంగా స్థితిమంతుడని సుకుమార్ వివరించారు. అల్ఫాన్సా, ఆమె సోదరుడు రాబర్ట్ ఉద్దేశపూర్వకంగానే వినోద్‌కుమార్‌ను తమ వలలో వేసుకున్నారని ఆరోపించారు. తరచూ డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో పాటు, తనను పెళ్లి చేసుకోమంటూ అల్ఫాన్సా వేధిస్తూ వచ్చిందని ఆరోపించారు. వినోద్‌కుమార్ ముక్కు నుంచి రక్తస్రావం కావడం, తలకు బలమైన గాయం ఉండటం చూస్తుంటే, ఇది హత్యే అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, ఇన్‌స్పెక్టర్ సచ్చిదానందన్ నేతృత్వంలోని బృందం దర్యాప్తునకు రంగంలోకి దిగింది.

కామెంట్‌లు లేవు: