25 జులై, 2012

గుప్త నిధి వేట: కిడ్నాప్ కథలో చిరు గన్‌మన్



















నిజామాబాద్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఉదంతంలో నలుగురు ప్రత్యేక రక్షణ దళానికి చెందిన పోలీసులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వ్యాపారి వద్ద గుప్త సంపద ఉందనే ఉద్దేశంతో అతన్ని వారు కిడ్నాప్ చేసి వేధించారు. ఆ నలుగురిలో ఒకతను రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గన్‌మన్ కాగా, మరొకతను ఐపియస్ ఆఫీసర్ శివశంకర్ గన్‌మన్.

ఆ నలుగురు పోలీసులకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న పోలీసులు నలుగురు - అద్దంకి సీతారాములు, ఉప్పల శ్రీనివాస్, వనం హరిబాబు, జి. గోపాల్. బాధితుడు కోనేరు కృష్ణను ఆ నలుగురు పోలీసులు జులై 11వ తేదీన పిట్లం గ్రామం నుంచి కిడ్నాప్ చేసి హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. దాచిన గుప్త ధనం వివరాలు చెప్పారని వారు కోేరు కృష్ణను వేధించారని చెబుతున్నారు.

పిట్లం అటవీ ప్రాంతంలో కోనేరు కృష్ణకు భారీ గుప్త నిధి దొరికిందని, దాన్ని అతను దాచి పెట్టాడని అదే గ్రామానికి చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి నిందితులకు చెప్పాడని సమాచారం. నలుగురు ఎపిఎస్‌పి పోలీసులతో పాటు పది మందితో కూడిన ముఠా కృష్ణను ఆ నిధి కోసం వేధించిందని అంటున్నారు. వారి వేధింపులు భరించలేక నిధిని తన ఇంట్లోనే దాచినట్లు కృష్ణ చెప్పాడట.

దాంతో కృష్ణను వారు పిట్లం తీసుకుని వచ్చి నిధి కోసం వేట సాగించారు. అది లభించకపోవడంతో వారు అతన్ని వేధించడం ప్రారంభించారు. ఈ సమయంలో కృష్ణ అలారం మోగించాడని, దాంతో ఇరుగుపొరుగువారు వచ్చారని, దాంతో నిందితులంతా పారిపోయారని అంటున్నారు. తమకు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిని అరెస్టు చేశామని బాన్స్‌వాడ సిఐ ప్రకాష్ యాదవ్ చెప్పారు.

నిందితుల్లో సీతారాములు చిరంజీవి సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నాడని, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఐపియస్ అధికారి శివశంకర్ గన్‌మన్ అని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. గోపాల్ గతంలో ముఖ్యమంత్రి సెక్యురిటీ వింగ్‌లో పని చేశాడు. హరిబాబు కొండాపూర్ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నలుగురిని సస్పెండ్ చేశారు.

కామెంట్‌లు లేవు: