రాజకీయం


వైయస్ జగన్ అభ్యర్థిపై నేదురుమల్లి రాజ్యలక్ష్మి



                          Nedurumalli Rajyalakshmi


మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భార్య, మాజీ రాష్ట్ర మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ వెంట నడుస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి లోకసభ స్థానానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా మారింది. 

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి పనిచేస్తూ వచ్చారు. అందువల్ల శాసనసభ ఎన్నికల్లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఓడిపోయారని అంటారు. అప్పటి నుంచి రాజ్యలక్ష్మి మౌనంగా ఉన్నారు. నెల్లూరు లోకసభ స్థానం ఖాళీ కావడంతో ఆమెలో మళ్లీ ఆశలు చిగురుస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో నేదురమల్లి జనార్దన్ రెడ్డికి బలమైన లాబీ ఉంది. 

ఆనం సోదరులు ఓ వైపు, నేదురుమల్లి కుటుంబ మరో వైపు కాంగ్రెసు రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇరు వర్గాలకు మధ్య వైరం కూడా ఉంది. అయితే, ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ఆనం సోదరులు రాజ్యలక్ష్మికి లోకసభ టికెట్ రాకుండా అడ్డుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, ప్రస్తుత తరుణంలో మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కునే సత్తా రాజ్యలక్ష్మికి మాత్రమే ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెసు అధిష్టానం రాజ్యలక్ష్మి వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.




వైయస్‌ఆర్‌పై కక్ష మాపై తీర్చుకోండి: సభలో విజయమ్మ




హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏమైనా కక్ష ఉంటే తమపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అసెంబ్లీలో అన్నారు. ఆమె ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. వైయస్ కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి పైన కక్ష ఉంటే మాపై తీసుకోండి కానీ ఆయన పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై కాదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఎందుకు నడపలేక పోతుందన్నారు. పెట్రోలు, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో అందరికీ తెలుసన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ పన్నులు, ధరలు పెంచలేదన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ పన్నులు పెంచకుండానే ఎలా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టగలుగుతున్నారని వైయస్సార్‌ను అప్పుడు అడిగారన్నారు. వ్యాట్‌ను ఎందుకు పెంచవలసి వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైయస్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆదాయం ఉన్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం దివంగత వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు పరచడం లేదని, ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు నష్ట పోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం పన్నులతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.

వైయస్ కాలంలో పన్నులేవీ పెరగలేదని పెరిగిందల్లా సంక్షేమమే అన్నారు. ఉచిత విద్యుత్‌ను ఎందుకు నీరుగారుస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన విధంగా పేదవారికి బియ్యం కోటా పెంచలేదన్నారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. పేదలు కొనుక్కోలేని విధంగా నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. బడ్జెట్‌లో వరికి బోనస్ ప్రస్తావన లేదన్నారు. వ్యవసాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు ఎందుకు ఇవ్వలేక పోతున్నారన్నారు.



డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్?


DL Ravindra Reddy


మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సూట్‌కేసులు మోసి పదవులు తెచ్చుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేశాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం కన్నా ఆ వ్యాఖ్యల మీదనే అధిష్టానం ఎక్కువగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. డిఎల్ రవీంద్రా రెడ్డిని వివరణ కోరబోమని రాష్ట్రానికి చెందిన ఎఎసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చెప్పినప్పటికీ ఆ విషయాన్ని వదిలేస్తే నష్టం జరుగుతుందని అధిష్టాన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

డిఎల్ రవీంద్రా రెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని అధిష్టానం రవీంద్రా రెడ్డిని ఆదేశించే అవకాశం ఉంది. పదవుల కోసం ఢిల్లీకి కొంత మంది నాయకులు సూట్‌కేసులు మోస్తున్నారని, తన పద్ధతి అది కాదని డిఎల్ అన్నారు. డిఎల్ వ్యాఖ్యలకు సంబంధించిన సిడిలను, వార్తాపత్రికల క్లిప్పింగులను కొంత మంది పార్టీ నాయకులు అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రతి రోజూ విమర్శలు చేస్తున్నారు. తిరుపతిలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కడప జిల్లా పార్టీ నాయకుల సమావేశానికి తాను రాబోనని చెబుతూ ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పైగా, కడపకు రావడానికి ముఖ్యమంత్రి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు లేవు: