16 ఫిబ్ర, 2012

అమెరికాతో ఢీకి ఇరాన్ రెడీ, అణుశక్తి ప్రదర్సన

టెహ్రాన్: తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికాను ఢీకొనడానికి ఇరాన్ సిద్దపడుతున్నట్లు కనిపిస్తోంది. న్యూఢిల్లీ, బ్యాంకాక్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ ముస్లిం దేశాన్ని నిందిస్తోంది. ఈ స్థితిలో ఇరాన్‌ను ఏకాకిని చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ స్థితిలోనే ఇరాన్ తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి సిద్ధపడింది. ఆరు దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేసింది. ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధికి నడుం కట్టిందని అమెరికా భావిస్తోంది. అధునాతన ఇంధన ప్రక్రియను ఇరాన్ ప్రారంభించింది. అణు రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరాన్ ప్రదర్శించింది. ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదినెజాద్ కూడా ధ్రువీకరించారు.

ఈ కొత్త అణ్వాయుధ శక్తి ప్రదర్శించిన నేపథ్యంలోనే ఇరాన్‌ను ఏకాకిని చేయాలని ఒబామా పిలుపునిచ్చారు. కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆరు ఐరోపా దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేసింది. నెదర్లాండ్స్, గ్రీసు, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ దేశాలకు చమురు ఎగుమతులు నిలిపేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాగా, చైనా ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు అనిపిస్తోంది.

ఢిల్లీ పేలుళ్లకు ఇరానియన్ కారణం కాదని అహ్మద్ నెజాదీ స్పష్టం చేశారు. భారతీయుడి చేతనే ఆ పేలుడు జరిపించారని ఆయన ఆరోపించారు. పేలుడుకు ముందు డ్రిల్లింగ్ జరిగిందని ఆయన అన్నారు. చమురు సరఫరాను నిలిపేయలేదని ఆయన చెప్పారు. అయితే, నిలిపేస్తామని మాత్రం ఆయన హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమ ఉద్దేశాలను అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేశామని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు: