హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాలు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంతో పోరుకు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును ఇచ్చాయి. గతంలో సకల జనుల సమ్మె సమయంలో తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పటి వరకు వాటిని అమలు పర్చలేదని, ఆ డిమాండ్లు వెంటనే తీర్చాలని చీఫ్ సెక్రటరీని వారు కోరారు. సమ్మె సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో మరోసారి సమ్మెకు దిగుతామని ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం వాగ్ధానాలు నెరవేర్చని పక్షంలో సకల జనుల సమ్మెకు మించి ఉద్యమిస్తామని అన్నారు. మార్చి 22వ తేదిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
కాగా గత సంవత్సరం ద్వితీయార్థంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా సకల జనుల సమ్మెను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు నెలన్నర రోజులు ఈ సమ్మె కొనసాగింది. దీంతో రాష్ట్ర ప్రజలు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సింగరేణి, విద్యుత్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా పలు సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్న ఎఫెక్ట్ రాష్ట్రంపై చాలా రోజులు పడిన విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం విద్యుత్ కోతకు గురైంది. పలుమార్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించారు. అయితే అప్పటి వాగ్ధానాలు నెరవేర్చలేదని చెబుతూ ఉద్యోగులు మళ్లీ సమ్మె నోటీసులు ఇచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి