11 ఫిబ్ర, 2012

చంద్రబాబు లాగు తడుపుకున్నారు: కెటిఆర్ వ్యాఖ్య

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు తీవ్రంగా మండిపడ్డారు. సిబిఐ దర్యాప్తు అంటేనే చంద్రబాబు లాగు తడుపుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆస్తులపై తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. పెంపుడు జంతువులతో మాట్లాడించడం మానుకుని చంద్రబాబు చర్చకు రావాలని ఆయన అన్నారు. 

కుక్కలు మొరిగితే తమకు జరిగే నష్టం ఏమీ లేదని ఆయన తెలుగుదేశం తెలంగాణ నాయకుల విమర్శలను ఉద్దేశించి అన్నారు. దమ్ముంటే విషయాల మీద మాట్లాడాలని ఆయన అన్నారు. లేదంటే నోరు మూసుకుని బైక్ ర్యాలీ, ఎడ్ల బండి సవారీ అంటూ డ్రామాలు ఆడుకోవాలని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అని, ఇప్పుడది కాంట్రాక్టర్ల పార్టీ అని ఆయన అన్నారు. 

రానున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చావు దేబెబ తీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. సిబిఐ విచారణ వేసినా, సిఐఎ విచారణ వేసినా తాము సిద్ధంగా ఉన్నామని, తాము చంద్రబాబు మాదిరిగా లాగు తడుపుకుని పారిపోయే రకం కాదని, మగటిమ ఉంటే చంద్రబాబు ఆస్తులపై చర్చకు వస్తారా అని ఆయన అన్నారు. టిడిపిలో ఎన్టీ రామారావు కుమారులు, మనవలున్నారు గానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆయన అడిగారు.

కామెంట్‌లు లేవు: