1 మార్చి, 2012

కిషన్‌జీ వారసుడు రామకృష్ణ అలియాస్ ఆర్కె అరెస్టు

                                     Ramakrishna

కోల్‌కత్తా: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కెను పోలీసులు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో ఆరెస్టు చేశారు. ఎదురుకాల్పుల్లో మరణించిన మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ వారసుడిగా ఆర్కే వచ్చినట్లు చెబుతున్నారు. కోల్‌కత్తాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్కెతో పాటు అతని నలుగురు అనుచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం చెప్పారు. 

మెకానికల్ ఇంజనీర్ అయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్కె నిషేధిత మావోయిస్టు పార్టీ సెంట్రల్ టెక్నికల్ కమిటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్కేతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మార్చి 13వ తేదీ వరకు కోల్‌కత్తా పోలీసు కస్టడీకి అప్పగించారు. ఆర్కెతో పాటు సుకుమార్ మండల్, బాపి ముడి, సాంబు పాత్రా, దీపక్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు గట్టి భద్రత మధ్య అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్ బందోపాధ్యాయ ముందు హాజరు పరిచారు. 

కోల్‌కత్తా పోలీసు స్పెషల్ టాస్క్‌ఫోర్స్త్‌‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్ మావోయిస్టులను వివిధ ప్రాంతాల నుంచి అరెస్టు చేశారు. ఓ ఆయుధ భవనం వర్క్‌షాప్‌ను ఆ బలగాలు ఛేదించాయి. రాకెట్ లాంచర్లు, పేలుడు పదార్ధాలు, 2.5 లక్షల రూపాయల నగదు, పలు రౌండ్ల లైవ్ ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. 

ఆర్కెను, దీపక్‌ను బుధవారం ఉత్తర కోల్‌కత్తాలో అరెస్టు చేశారు. ముడి, పాత్ర, మండల్‌లను నార్త్ 24 పరగణలోని బెల్గోరియాలో అరెస్టు చేశారు. ఆర్కె ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలో మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలకు నాయకత్వం వహించినట్లు ఎస్‌టిఎఫ్ అధికారులు చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్నది ఆర్కె కాదని, సాధనాల రామకృష్ణ అని చెబుతున్నారు. అతన్ని సాధనాల అలియాస్ సంతోష్‌గా చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: