22 జూన్, 2012

ఉగండాలో హైదరాబాదీ రాజేందర్ రెడ్డి సజీవ దహనం





















పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన హైదరాబాదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సజీవ దహనం అయ్యాడు. గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారని తోటి కార్మికు లు చెబుతుండగా, ఆత్మహత్య చేసుకున్నాడని యజమాని చెబుతున్నారు. ఉగండాలో బోర్‌ బండి ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర రెడ్డి ఉగండాలో అసువులు బాశాడు. నాలుగు నెలల క్రితమే అతను ఉగండా వెళ్లాడు.

నల్గొండ జిల్లా పోచంపల్లి మండలం పల్లెగూడ గ్రామానికి చెందిన అప్పిరెడ్డి కృష్ణారెడ్డి, సుశీల దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చారు. నాగోల్ బండ్లగూ డ ఇంద్రప్రస్థ కాలనీలో ఇల్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు.. రాజేందర్‌రెడ్డి (35), సురేందర్‌రెడ్డి. వీరిలో రాజేందర్ బోరు బండి ఆపరేటర్‌గా పనిచేసేవారు. అతనికి భార్య రాణి, కుమారులు రేవంత్‌రెడ్డి, చరణ్‌రెడ్డి ఉన్నారు.

సికింద్రాబాదులోని తార్నాకకు చెందిన వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఉగాండా దేశ రాజధాని కంపాలాలో ఐదు బోరు బండ్లను నిర్వహిస్తున్నారు. అక్కడ బోరు బండి ఆపరేటర్ అవసరం ఉండటంతో రాజేందర్‌ని కంపాలాకు తీసుకువెళ్లారు. అక్కణ్నుంచి రాజేందర్ మధ్య మధ్యలో కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడేవారు. అలాగు బుధవారం రాత్రి కూడ ఫోన్ చేసి భార్య, పిల్లలతో మాట్లాడారు. కానీ, గురువారం ఉదయాన్నే బోరు బండ్ల యజమాని వెంకటేశ్వరరెడ్డి బావమరిది ప్రభాకర్‌రెడ్డి రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతను అగ్నిప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

మధ్యాహ్నం మరొకసారి ఫోన్ చేసి రాజేందర్‌రెడ్డి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాజేందర్ కుటుంబ సభ్యులు ఉగాండాలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అతనితో కలిసి పనిచేసే వారికి ఫోన్ చేసి వాకబు చేశారు. గుర్తుతెలియని దుండగులు బోరు బండిని తగలబెట్టారని, ఈ ఘటనలో రాజేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు కంపాలావాసులు మృతి చెందారని వెల్లడించారు.

బోరు బండి యజమాని వెంకటేశ్వరరెడ్డికి ఫోన్ చేయగా, అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, మరో ఐదు రోజుల్లో మృతదేహాన్ని నగరానికి తీసుకుని వస్తానని చెప్పాడు. వెంకటేశ్వరరెడ్డి చెబుతున్న దానికి, రాజేందర్‌రెడ్డితో పాటు పనిచేస్తున్న వారు చెబుతున్న కథనానికి పొంతన లేకపోవడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: