13 జూన్, 2012

అలా చెప్పుకోవడానికి గర్వపడతాను :అనుష్క




                                                       


‘రగడ’ తర్వాత అనుష్క నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం తమిళ సినిమాపైనే ఆమె ఎక్కువ శ్రద్ధ పెట్టారు. తెలుగులో డమరుకం, వారధి చిత్రాల్లో నటిస్తున్న అనుష్క చేతిలో ప్రస్తుతం అయిదు తమిళ సినిమాలున్నాయి. దీన్ని బట్టి కోలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన తెలుగుతెరపై సీత కన్ను వేయడానికి కారణం ఏంటి? అని అనుష్కను అడిగితే -‘‘తెలుగుతెరకు దూరం అయ్యానని నేనైతే అనుకోవడం లేదు. నాగార్జునగారితో నేను నటిస్తున్న ‘డమరుకం’ షూటింగ్ ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది.

అలాగే ప్రభాస్‌తో కలిసి ‘వారధి’లో నటిస్తున్నాను. వీటితోపాటు ఆర్యతో నేను నటించిన తమిళ చిత్రం ‘ఇరందమ్ ఉళగన్’ చిత్రం ‘బృందావనంలో నందకుమారుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు నేను ఎక్కడ దూరంగా ఉన్నట్టు. తమిళంలో ముందుగా కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం వల్ల వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ప్రస్తుతం తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నాను. మరో విషయం ఏంటంటే... కొత్తగా నేను ఏ తమిళ ప్రాజెక్ట్‌కీ సైన్ చేయలేదు.

ప్రస్తుతం తెలుగు కథలే వింటున్నాను. నేను ఏ భాషలో నటించినా నాకు మాత్రం తెలుగు హీరోయిన్‌గానే గుర్తింపు. నేను తెలుగు హీరోయిన్‌ని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని చెప్పారు జేజమ్మ. ఇదిలావుంటే... కార్తీ ‘శకుని’ చిత్రంలో అనుష్క ఓ కీలక పాత్ర పోషించారు. ఆమె పాత్ర ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలోనే ‘శకుని’ విడుదల కానుంది.

కామెంట్‌లు లేవు: