29 జూన్, 2012

రాయల తెలంగాణ లేదా యుటిగా హైదరాబాద్





















హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి ఏ విధమైన ఫార్ములాను అనుసరించాలనే విషయంపై కాంగ్రెసు అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రాజకీయ నాయకులకు ఆమోదయోగమైన ఫార్ములాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర రాజకీయ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇతర అవకాశాలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు అర్థమవుతోంది.

రాయల తెలంగాణ ఏర్పాటుకు రాయలసీమకు చెందిన రాజకీయ నాయకులు కొంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వంటి నాయకులు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నారు. హైదరాబాదులో బలంగా ఉన్న మజ్లీస్ పార్టీ కూడా ఇదే ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతోంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనేది ఈ ప్రతిపాదన సారాంశం.

రాయల తెలంగాణ ఏర్పాటు వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని ఈ ప్రాంతంలో తగ్గించవచ్చుననేది కూడా ఓ ఆలోచన. సీమాంధ్రలో వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ప్రయోగించడం వల్ల ఫలితాలు రాబట్టవచ్చునని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం నుంచి వైయస్ జగన్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా దూరమవుతారు. దీనివల్ల కాంగ్రెసుకు ప్రయోజనం కలుగుతుందనే అంచనా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానమైన ఆటంకం హైదరాబాదు నగరమనే అభిప్రాయం బలంగా ఉంది. హైదరాబాదును వదులుకోవడానికి సీమాంధ్ర రాజకీయ నాయకులు ఇష్టపడకపోవడం వల్లనే సమస్య జఠిలమవుతోందని భావిస్తున్నారు. రాష్ట్రాన్ని రెండు విభజించి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనకు మజ్లీస్ సుముఖంగా లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రాన్ని విభజించదలిస్తే హైదరాబాదు తెలంగాణలో ఉండాలని మజ్లీస్ అంటోంది.

రాష్ట్రంలో తన పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే తెలంగాణ సమస్యను పరిష్కరించక తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెసు అధిష్టానం ఉప ఎన్నికల ఫలితాలపై నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటేనే, రాష్ట్ర విభజనపై కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి వాయలార్ రవి సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నివాసంలో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మూడు ప్రాంతాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం పెద్దలు మాట్లాడుతారని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: