న్యూఢిల్లీ: తమ పార్టీ ఓటు బ్యాంకు రోజురోజుకూ క్షీణిస్తోందని, తమ
పార్టీకి విధేయంగా ఉన్న వర్గాలన్నీ చెప్పుకోదగిన స్థాయిలో వైయస్సార్
కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని, దీనివల్ల కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ
చేరినా ఫలితం లేకపోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజ్యసభ
సభ్యుడు చిరంజీవి చెప్పినట్లు తెలిసింది. బుధవారం దాదాపు అరగంట సేపు
సోనియాతో మంతనాలు జరిపిన చిరంజీవి, అనేక నియోజకవర్గాల్లో పైస్థాయి నుంచి
కింది వరకూ ప్రజారాజ్యం నుంచి చేరిన వారికీ, కాంగ్రెస్ కార్యకర్తలకూ
సమన్వయం లేకుండా పోయిందని, ఇరు వర్గాలు కలిసి పనిచేయలేకపోయానని చెప్పినట్లు
విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ ఓటుబ్యాంకు కొంతమేరకు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బదిలీ అయినా ప్రజారాజ్యం వల్ల వచ్చిన ఓటు
బ్యాంకు చెక్కుచెదరకుండా ఉన్నదని ఆయన గణాంకాలతో సహా చెప్పినట్లు తెలిసింది.
తగ్గిన ఓటింగ్ శాతం ఏ వర్గానిదో శాస్త్రీయంగా అంచనా వేసి చర్యలు
తీసుకోవాలని, అంతటా సమన్వయం ఏర్పడకపోతే పార్టీ బలమైన శక్తిగా నిలబడలేదని
ఆయన తెలిపినట్లు సమాచారం. కాంగ్రెస్‌పై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల గురించి
సోనియా ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల కార్యకర్తల
మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆమె చెప్పినట్లు సమాచారం.
పార్టీలో సమన్వయం రావాల్సి ఉందని
తాను సోనియాగాంధీకి చెప్పగా, దానికి ఆమె అంగీకరించారని చిరంజీవి తెలిపారు.
సమన్వయం తెచ్చేందుకు కార్యాచరణ ఎలా ఉండాలో ఆమె రూపొందిస్తారని, దానిని
తాము పాటిస్తామని వెల్లడించారు. సోనియాను కలిసిన తర్వాత.. మంత్రులు గంటా
శ్రీనివాసరావు, రామచంద్రయ్యలతో కలసి చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
ఉపఎన్నికల్లో
పార్టీ వైఫల్యం, రెండుచోట్ల విజయానికి కారణాలపై సోనియాతో చర్చించానని,
చాలా విషయాలపై ఆమెకు అవగాహన ఉందని అన్నారు. మేడమ్ వద్ద పార్టీ, ప్రభుత్వ
తీరుపై ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేశారా? అని ప్రశ్నించగా.. అసంతృప్తి
కాదని, భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపై తాము సలహాలు ఇచ్చామని, వాటిని ఆమె
నోట్ చేసుకున్నారని తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి