12 జూన్, 2012
నా దృష్టిలో రియల్‌స్టార్ అంటే పవన్‌కళ్యాణే
‘నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే... తెలుగు సినిమా పుట్టిన కొన్నాళ్ల వరకూ కథ, మాటలు రాసినవాళ్ళెవరూ దర్శకులుగా సక్సెస్ కాలేకపోయారు. దాన్ని బ్రేక్ చేసింది నేనే. నా తర్వాత జంధ్యాల ఆ క్రెడిట్ సాధించారు. మా దారిలోనే త్రివిక్రమ్ కూడా విజయం సాధించడం ఆనందించదగ్గ విషయం. ఒక మంచి రచయిత దర్శకత్వంలో సినిమా వస్తే ఆ సినిమా ఒక కావ్యం అవుతుంది. అందుకు ఏన్నో సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు.
నేను ‘జల్సా’ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేను. ‘జులాయి’తో త్రివిక్రమ్ మళ్లీ తన జండా ఎగురవేస్తాడని నా నమ్మకం. ‘గంగోత్రి’లో బన్నీని చూసినప్పుడు.. ‘ఇతను కామెడీ హీరో అవుతాడా? లేక ఫ్యామీలీ హీరో అవుతాడా?’ అనే ఆలోచనలు నా మనసులో మెదిలాయి. నా ఆలోచనలకు భిన్నంగా తనకంటూ ఓ సపరేట్ రూట్‌ని క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. ‘దేశముదురు’ చూసి తనలో ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. వారం రోజుల క్రితమే పాటలు విన్నాను. ఈ పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు డాన్సులుచేస్తారు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘జులాయి’. ఇలియానా కథానాయిక. డీవీవీ దానయ్య సమర్పకుడు.
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించి తొలి ప్రతిని దాసరి నారాయణరావుకు అందించారు. ఈ సందర్భంగా దాసరి పై విధంగా స్పందించారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ-‘‘నా దృష్టిలో రియల్‌స్టార్ అంటే పవర్‌స్టారే. పవన్‌కళ్యాణ్ రావడం వల్ల ఈ వేడుక కొత్త కళను సంతరించుకుంది.
ఫైట్లు, డాన్సులు గొప్పగా చేసినంత మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు అలవోకగా వల్లించినంత మాత్రాన ఎవరూ పెద్ద స్టార్లు అయిపోరు. ఇక్కడ ప్రవర్తన ముఖ్యం. ఈ మధ్య హిట్ అనిపించుకున్న ఏ సినిమా పోస్టర్ చూసినా ఆల్‌టైమ్ రికార్ట్ అని కనిపిస్తుంది. కానీ ‘గబ్బర్ సింగ్’ పోస్టర్‌లో మాత్రం ఆ అక్షరాలు కనిపించవు. ఎందుకంటే... పవన్‌కళ్యాణ్‌కి అభద్రతాభావం లేదు. అలాగే... ఓ సారి వేరే హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను ఆనందపడ్డాను. అప్పుడు ‘అలా ఆనందపడకూడదు. చాలా కష్టపడి సినిమా చేసుంటారు కదా’ అని సున్నితంగా మందలించారు పవన్‌కళ్యాణ్. ఆయన రియల్‌స్టార్ అనడానికి ఇదే నిదర్శనం.
నా దృష్టిలో ఆయనకు ఆయనే పోటీ. దేవిశ్రీ కాంబినేషన్‌లోని నా పాటలంటే చాలామందికి ఇష్టం. కానీ నాకు మాత్రం దేవీశ్రీ, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇష్టం’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డా.రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, నాగబాబు, దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి, శ్రీనువైట్ల, తమన్నా, బ్రహ్మానందం, హరీష్‌శంకర్, బండ్లగణేష్, తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి