18 జూన్, 2012

ఉప ఫలితాలపై కిరణ్ మౌనమేలనోయి?




















ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెదవి విప్పడం లేదు. ఫలితాలు ఎలా ఉన్నా బాధ్యతాయుతమైన పదవుల్లో నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం పరిపాటి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి నోరు తెరవడం లేదు. ఉప ఎన్నికల ఫలితాలపై అన్ని రాజకీయ పార్టీలు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, హైకమాండ్ దూత, కేంద్రమంత్రి వయలార్ వంటి వారందరూ తమతమ అభిప్రాయాలు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఉప ఎన్నికల ఫలితాలపై తన స్పందన ఏమిటన్నది ఇంతవరకు వెల్లడించలేదు.
ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన పదిహేనో తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి స్పందన కోసం మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దీనిపై ఒక ప్రెస్‌నోట్ విడుదల చేస్తారని, 16న మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలు చెబుతారని సిఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కానీ సిఎం కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ప్రెస్ నోట్ సైతం విడుదల కాలేదు, కిరణ్ స్వయంగా నోరు విప్పనూ లేదు. ఇది సొంత పార్టీ వారికే ఆశ్చర్యం కలిగిస్తోంది.
పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లోను ఓటమి చెందింది. ఫలితాలు వెలువడిన రోజునే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అదే రోజు ఢిల్లీలో వయలార్ రవి సైతం ఫలితాలపై అభిప్రాయాలు వెల్లడించారు.

కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌తో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి తన అభిప్రాయాలు వెల్లడిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని కనీసం ఒక నోట్ అయినా ముఖ్యమంత్రి మీడియాకు విడుదల చేసి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు స్పందించకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదని, ఇది వేరే అనుమానాలకు తావిస్తుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలి, వైద్య మంత్రి కొండ్రు మురళి తదితరులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి తన మనసులోని అభిప్రాయాలను వారితో పంచుకోలేదని తెలిసింది. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఉప ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళన అవసరం లేదన్న భావం వ్యక్తమైందని చెప్పారు.

1 కామెంట్‌:

Vasusri919 చెప్పారు...

good