27 జూన్, 2012

సోనియా చేతికి చిరంజీవి రిపోర్ట్: రేపు ఢిల్లీకి బొత్స, సిఎం



















న్యూఢిల్లీ: హస్తినలో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర నేతలకు మొహం చాటేసిన ఢిల్లీ నేతలు ఇప్పుడు అడిగిన వారందరికీ అపాయింటుమెంట్ ఇచ్చేస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీరాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వరకు అందరినీ రాష్ట్రానికి చెందిన నేతలు కలుస్తున్నారు. అడిగినదే తడవుగా అందరికీ అపాయింటుమెంట్ దొరుకుతోంది! ఇప్పటికే సోనియాతో మూడు రోజుల క్రితం భేటీ అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మరోసారి గురువారం హస్తిన బాట పట్టనున్నారు. మొదలు కేంద్రమంత్రి, పార్టీ 

బుధవారం సోనియాతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి భేటీ అయ్యారు. తన వర్గానికి చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్యతో కలిసి ఆయన సోనియాను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలపై సోనియా గాంధీకి చిరంజీవి పదకొండు పేజీల నివేదికను సమర్పించారు. ఉప ఎన్నికల్లో ఓటమికి పార్టీలో సమన్వయం లేకపోవడం, జగన్ పార్టీ పట్ల సానుభూతి ఈ రెండు కారణాలుగా ఆయన తన నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.

అంతకుముందు చిరంజీవి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు రాష్ట్రంలోని నేతలంతా హస్తినలో మకాం వేశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యనేతలు, మంత్రులు తదితరులు ఢిల్లీలో పెద్దలతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

వారి భేటీలో జగన్, తెలంగాణ అంశాలు చర్చకు వస్తున్నట్లుగా సమాచారం. పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఢిల్లీలో వాలిపోయారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి కూడా సమాలోచనలు చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ కూడా భేటీ అయ్యారు. 

రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులు బుధవారం మధ్యాహ్నం సోనియాతో భేటీ అయ్యారు. మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, జానా రెడ్డి, శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు ఢిల్లీ వచ్చారు.

కామెంట్‌లు లేవు: