10 జులై, 2012

కొడాలి నాని జంప్: జూ. ఎన్టీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా?





















హైదరాబాద్: నందమూరి యువ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలి నాని ఆత్మరక్షణలో పడేశారనే మాట వినిపిస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన నాని ఆకస్మికంగా జగన్ పార్టీ వైపు వెళ్లడం జూనియర్‌ను ఇరుకున పెట్టిందని అంటున్నారు. దానివల్లనే ఆయన సోమవారం అప్పటికప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాని పార్టీ ఫిరాయింపుపై వివరణ ఇచ్చారని అంటున్నారు. దానితో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో నాని ఒకరు. ఆయన కుటుంబానికి నాని సన్నిహితుడు. 1999లో హరికృష్ణ తెలుగుదేశం పార్టీతో విభేదించి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి గుడివాడలో పోటీ చేశారు. అప్పుడు నాని ఆయనను బలపర్చి ప్రచారం చేశారు. తర్వాత హరికృష్ణతో పాటు నాని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో జూనియర్ ఒత్తిడితో అప్పటి గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును పక్కనపెట్టి నానికి టిక్కెట్టు ఇచ్చారు.

విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ కొంతకాలం కింద విజయవాడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిసి ఆలింగనం చేసుకొన్న సంఘటన జూనియర్ ఎన్టీఆర్‌ను చిక్కుల్లో పడేసింది. ఈ ఘటన అప్పుడే విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా దమ్ము వసూళ్లపై ప్రభావం చూపిందని అంటారు.

దమ్ముపై పడిన ప్రభావం వల్లనే తాను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేశారని చెబుతారు. ఇప్పుడు నాని ఫిరాయింపు కూడా తనపై పడే ప్రమాదం ఉందని గుర్తించిన ఎన్టీఆర్ వెంటనే స్పందించి తనకు తానుగానే మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అయితే, నింద తనపైకి రాకుండా చూసుకున్నారా, నిజంగానే నాని వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్‌కు తెలియదా అనే విషయం కొంత కాలం ఆగితే తప్ప తెలియదని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: