2 జులై, 2012

వ్యూహం మార్చిన యడ్యూరప్ప, రద్దుకు యత్నాలు























బెంగళూరు: ముఖ్యమంత్రి సదానంద గౌడను తొలగించాలని పలువురు బిజెపి ప్రజాప్రతినిధులు తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సామాజిక వర్గానికి చెందిన లింగాయత్‌లు గౌడను ఈ నెల 5లోగా తొలగించాలని డెడ్ లైన్ విధించారు. ఆయన స్థానంలో యడ్డీ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ శెట్టార్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. యడ్డీ వర్గం నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు.
అయితే తన వర్గం నేతలు జగదీష్ పేరును తెర పైకి తీసుకు వచ్చినప్పటికీ యడ్డీ ప్లాన్ మాత్రం మరోలా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జగదీష్ షెట్టార్‌కు కూడా పదవి రాకుండా చేయాలనే వ్యూహరచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. తన వర్గం ఈశ్వరప్పకు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ.... ఆయన మాత్రం లోలోన తనకు అత్యంత నమ్మకస్తులైన నేతలతో సదానంద గౌడ ప్రభుత్వాన్ని రద్దు చేయించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
యడ్డీ గవర్నర్ భరద్వాజ్‌ను కలిసి గౌడ ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశంపై చర్చించారని అంటున్నారు. యడ్డీ వైఖరి చూస్తుంటే జగదీష్ శెట్టార్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించేలా కనిపించడం లేదని అంటున్నారు. జగదీష్ నాయకత్వాన్ని కోరుతున్న యడ్డీ వర్గీయులకు అతను గవర్నర్‌ను రహస్యంగా కలిసి వేరే వ్యూహరచన చేస్తున్న విషయం తెలియక పోవచ్చునని అంటున్నారు. యడ్డీ గవర్నర్‌ను నాలుగుసార్లు రహస్యంగా కలిసినట్లుగా తెలుస్తోంది.
వారం రోజుల క్రితం గవర్నర్‌ను కలిసిన యడ్డీ, ప్రభుత్వాన్ని రద్దు చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారట. రాజ్ భవన్‌లో నాలుగుసార్లు గవర్నర్‌ను కలిసిన యడ్డీ ప్రయివేటు కారులో, తనకు నమ్మకమైన నేతలతో కలిసి వెళుతున్నారట. యడ్డి జూన్ 20వ తేదిన తొలిసారి గవర్నర్‌ను కలిశారట. ఆ తర్వాత 21న, 22న కూడా కలిశారు. ఆ తర్వాత జూన్ 28న మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నాలుగోసారి వెనుక ద్వారం ద్వారా రాజ్ భవన్‌కు వెళ్లిన యడ్డీ రెండు గంటలకు బయటకు వచ్చారు.
యడ్డీ వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టే విధంగా ఉందని అంటున్నారు. ఇప్పటికే యడ్డీ వర్గం సదానందను వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో గవర్నర్ విశ్వాస తీర్మానం కోరితే ముఖ్యమంత్రి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే జెడి(ఎస్) సదానంద ప్రభుత్వాన్ని బయట పడేసే అవకాశాలు మెండు అని యడ్డీ అభిప్రాయపడుతున్నారు. ఇక రెండోది.. శెట్టార్ నాయకత్వాన్ని అడ్డుకోవడం.
లింగాయత్ ప్రధాన నేతగా యడ్డీ ఇప్పటి వరకు ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన జగదీష్ ముఖ్యమంత్రి అయితే తన రాజకీయ జీవితమే చరమాంకంలో పడే అవకాశముందనే అనుమానాలు అతనిని వెంటాడుతున్నాయి. విశ్వాసం కోరితే జెడి(ఎస్) గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. బిజెపిపై మరింత ఒత్తిడి తెస్తే జగదీష్‌ను పీఠంపై కూర్చుండ బెట్టే అవకాశముంది. కాబట్టి ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాన్ని రద్దు చేయడమే మంచిదని యడ్డీ భావించి ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: