మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విశ్వనట చక్రవర్తి దివంగత ఎస్వీ రంగారావు
విగ్రహావిష్కరణ జరుగనుంది. జూలై 20వ తేదీన రాజమండ్రిలోని ధవళేశ్వరం వద్ద ఈ
కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అక్కడ స్పెషల్ ఫంక్షన్ ఏర్పాట్లు
చేస్తున్నారు. గతంలో చిరంజీవి ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని విజయవాడలో
ఆవిష్కరించగా, ఆయన సోదరుడు నాగబాబు గుంటూరులో ఎస్వీఆర్ విగ్రహాన్ని
ఆవిష్కరించారు.
కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ,
కోటీశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో
పనిచేసేవాడు. హిందూ కాలేజిలో డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో
ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్
తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు.
ఆ
తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో
ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
నట యశస్విగా పేరు
పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి
ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి
గడించాడు. మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి
చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక
చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ
ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన
ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు కన్నుమూశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి