12 జులై, 2012

కొడాలి నానిని తరిమికొట్టండి: చంద్రబాబు ఫైర్




















హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్న గుడివాడ శానససభ్యుడు కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నానిని తరిమికొట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నానిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నమ్మకద్రోహం చేసినవారిపై తిరగబడాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కొడాలి నాని నమ్మకద్రోహం చేశారని, పార్టీని వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. రెండు సార్లు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించామని, ఎంతో నమ్మకంతో నందమూరి తారకరామారావు పోటీ చేసిన గుడివాడ సీటు నుంచి నానికి అవకాశం కల్పించామని, నమ్మి టికెట్ ఇస్తే మోసం చేశారని చంద్రబాబు అన్నారు. తనను వారం రోజుల క్రితం కలిసి తాను జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడని, తాను పార్టీ వీడిపోయే పరిస్థితి ఉండదని కొడాలి నాని ఇటీవల చంద్రబాబును కలిసినప్పుడు నమ్మబలికినట్లు చెబుతున్నారు.

కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కొడాలి నానికి నచ్చజెప్పి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లారు. తాను పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రసక్తి లేదని నాని చంద్రబాబుతో చెప్పినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని సూచించినప్పుడు గుడివాడ వెళ్లిన తర్వాత ప్రకటిస్తానని హైదరాబాదు నుంచి వెళ్లిపోయారని అంటారు.

చంద్రబాబును కలిసిన తర్వాత కూడా మనసు మార్చుకోలేదని కొడాలి నాని మాటలను బట్టి అర్థమవుతూనే ఉంది. చివరకు కొడాలి నాని హైదరాబాదు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, ఆ తర్వాత అధ్క్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో దుమారం చెలరేగింది.

కామెంట్‌లు లేవు: