హైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
మంగళవారం అన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్
జగన్మోహన్ రెడ్డిని మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిశారు. అనంతరం
ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడారు.
తాను జైలులో తన మేనల్లుడు
జగన్‌ను, అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌లను కలిశానని చెప్పారు.
వారిని చూసి తన గుండె బరువెక్కిందని, ఆ బాధ తట్టుకోలేక పోతున్నానని, ఏం
మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. జగన్‌కు త్వరలో మంచి రోజులు
వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహాభారత యుద్ధం
జరుగుతున్నట్లుగా ఉందన్నారు.
మహాభారతంలో శకుని ఒక్కడేనని, కానీ
ఇప్పుడు మాత్రం ఢిల్లీలో ఎందరో శకునులు ఉన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు.
ఎందరు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందని
చెప్పారు. ఢిల్లీ పెద్దల కుయుక్తులతోనే జగన్‌కు ఈ దుస్థితి అన్నారు. త్వరలో
జగన్, నిమ్మగడ్డ బయటకు రావాలని తాను షిరిడీ సాయినాథుని కోరుకున్నానని
అన్నారు.
నిజాలు భగవంతుడికి మాత్రమే తెలుసునని, భగవంతుడి ఆశీస్సులతో
భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందన్నారు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో దేవుడు
నిర్ణయిస్తాడని అలాగే జరుగుతుందని అన్నారు. కాగా మోహన్ బాబు తన తనయుడు మంచు
విష్ణుతో కలిసి జగన్‌ను, మోపిదేవిని కలిశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి