25 జులై, 2012

జగన్ ఎంట్రీతో వెన్నులో వణుకు: కెసిఆర్ సైలెన్స్
















వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెన్నులో వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థి జగన్ పార్టీ నేత కొండా సురేఖ చేతిలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలుపొందారు. పరకాలలో తన సత్తా తేలడంతో జగన్ తెలంగాణలోనూ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. అందుకే తన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష తలపెట్టారు.

ఆమె ఈరోజు(సోమవారం) తన దీక్ష కోసం సిరిసిల్ల వెళుతుండగా ముందుగా హెచ్చరించినట్లుగానే తెరాస కార్యకర్తలు ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు. రెండు రోజుల ముందు నుండే విజయమ్మ దీక్షపై తెరాస సిరిసిల్లలోను, హైదరాబాదులోనూ హంగామా చేసింది. విజయమ్మ దీక్ష కోసం ఆ పార్టీ కార్యకర్తలు కట్టిన జగన్, విజయమ్మల ఫ్లెక్సీలను, కటౌట్‌లను చించి వేశారు. మరోవైపు తెరాస ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా పలువురు ముఖ్య నేతలు వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.

తెలంగాణ తీవ్రంగా నష్ట పోవడానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియేనని, ఇప్పుడు ఆయన సతీమణి తెలంగాణకు వస్తే ఎలా రానిస్తామని, వైయస్ గతంలో చెప్పినట్లుగా విజయమ్మ ఏ వీసా తీసుకొని సిరిసిల్లకు వస్తున్నారని వారు జగన్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం.

నిన్న మొన్నటి వరకు ఆగస్టు లేదా సెప్టెంబరులో తెలంగాణ వస్తుందని, అలా తనకు సంకేతాలు ఉన్నాయని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన పైన ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. అయితే మూడు నాలుగు నెలల్లో తెలంగాణ వస్తుందని కెసిఆర్‌కు అంతగా విశ్వాసం ఉన్నప్పుడు విజయమ్మను అడ్డుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. విభజనపై ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తెలంగాణే వచ్చే అవకాశమే ఉంటే ఇక సమైక్యవాదులను అడ్డుకోవడంలో అర్థమే లేదంటున్నారు.

తెరాస విజయమ్మను అడ్డుకోవడం చూస్తుంటే కెసిఆర్ చెప్పినట్లుగా మూడు నాలుగు నెలల్లో తెలంగాణ వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఆయన మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి గెలుపు, పరకాలలో జగన్ ప్రభంజనం కెసిఆర్‌కు ముచ్చెమటలు పట్టించిందని అంటున్నారు.

తెలంగాణకు గట్టిగా మద్దతిస్తున్న ఏకైక జాతీయ పార్టీ బిజెపి. అలాంటి బిజెపి పాలమూరులో గెలిచినప్పుడు తెరాస సాదరంగా ఆహ్వానించలేదని, ఆ పార్టీని తెలంగాణలో నిలదొక్కుకోకుండా చేసేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదంటున్నారు. కెసిఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే సీట్ల కోసం కాకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం పాలమూరు గెలుపు తర్వాత కూడా బిజెపితో కలిసి వెళ్లేవారని, కాని ఓట్లు సీట్లే లక్ష్యంగా ఉన్న కెసిఆర్ మాత్రం ఆలా చేయలేదని అంటున్నారు.

తెలంగాణకు అనుకూలంగా లేనప్పటికీ జగన్ పార్టీ ఇక్కడ తన సత్తా చాటుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీని నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పాలమూరులో బిజెపి గెలుపు తర్వాత మిగిలిన పార్టీల కంటే ఆ పార్టీనే టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుందని, అయితే పరకాలలో బిజెపి దరావత్తు కోల్పోవడంతో ఆ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని గ్రహించిన తెరాస దానిని వదిలి, తమకు ముచ్చెమటలు పట్టించిన జగన్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నదని అంటున్నారు. అంతకుముందు కూడా తెలంగాణలో బలంగా ఉన్న టిడిపిని దెబ్బ తీసిందని చెబుతున్నారు.

మొన్న తెలంగాణలో గట్టి క్యాడర్ ఉన్న టిడిపిని, నిన్న గెలుపు ఉత్సాహంలో ఉన్న బిజెపిని, తాజాగా ప్రభంజనం సృష్టిస్తామని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకోవడం వెనుక తెలంగాణలో గత పదేళ్లుగా ఉన్న తమ ప్రాభవాన్ని కాపాడుకునేందుకే తప్ప, తెలంగాణ కోసం మాత్రం కాదనే విమర్శలు వస్తున్నాయి. విజయమ్మ దీక్షపై తెరాస ఇంత హడావుడి చేస్తుంటే కెసిఆర్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

కామెంట్‌లు లేవు: