హైదరాబాద్: నార్కో టెస్టుల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
ఊరట లభించింది. వైయస్ జగన్‌కు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి
రెడ్డికి నార్కో టెస్టులు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ
దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది. ఆస్తుల కేసులో
నిందితులు జగన్, విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలతో కోర్టు
ఏకీభవించింది.
వైయస్ జగన్, విజయ సాయిరెడ్డి కేసులో కీలక
కుట్రదారులని, వారి నుంచి నిజాలు రాబట్టాల్సిన అవసరం ఉందని సిబిఐ చెబుతూ
అందుకు వారిద్దరికి నార్కో టెస్టులు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని
కోరింది. రూ. 1200 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, దీనిపై తాము విచారణ
జరుపుతున్నామని, అయితే విచారణలో జగన్, విజయసాయి రెడ్డి తాము అడిగిన
ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వలేదని, తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దాంతో
వారికి నార్కో టెస్టులు నిర్వహించి నిజాలు రాబట్టాల్సిన అవసరం ఉందని
వాదించింది.
నిందితుల అనుమతి లేనిదే నార్కో టెస్టులు నిర్వహించకూడదని
సుప్రీంకోర్టు మార్దదర్శకాలు ఉన్నాయని, అందువల్ల నార్కో టెస్టుల నిర్వహణకు
సిబిఐకి అనుమతి ఇవ్వకూడదని జగన్, సాయిరెడ్డి తరఫు న్యాయవాదులు అన్నారు.
నార్కో టెస్టుల వల్ల నిందితుల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని
వారన్నారు. సిబిఐ దురుద్దేశంతో జగన్‌ను లక్ష్యం చేసుకుని వ్యవహరిస్తోందని
వారన్నారు.
విజయసాయి రెడ్డికి నార్కో టెస్టులు నిర్వహించడానికి
అనుమతి ఇవ్వాలని గతంలో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు
కొట్టేసింది. ప్రస్తుత స్థితిలో వైయస్ జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని
కోరుతూ సిబిఐ మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి