హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతును మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ,
మాజీ సభాపతి పిఏ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల కోసం కోరడం సరికాదని
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అంటున్నారని,
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలా లేక ముఖ్యమంత్రులను మార్చడమా
చెప్పాలన్నారు.
సిఎంల మార్పు లేదా ఎమర్జెన్సీ తీసుకు వస్తామని కిరణ్
చెబుతున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను ఏమాత్రం
పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల కోసమంటూ ఆర్భాటంగా రచ్చబండను ప్రవేశ
పెట్టారని, కానీ ఆ కార్యక్రమంలో కోటి దరఖాస్తులు వస్తే వాటిని బుట్ట దాఖలు
చేశారన్నారు. 1978 నుండి 1989 వరకు ఉన్న పరిస్థితులే రాష్ట్రంలో
పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు.
సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్
అధికారి శ్యామ్యూల్‌ను సిసిఎల్ఏ ప్రధాన కమిషనర్‌గా ఎలా నియమిస్తారని ఆయన
ప్రశ్నించారు. విచారణ ఎదుర్కొంటున్న అధికారిని ఇలా నియమించడం
శోచనీయమన్నారు. కాంగ్రెసు పార్టీకి నీతి నియమాలు లేవని, అధికారం, డబ్బే
పరమావధిగా మారాయన్నారు. ఇందుకు మంచి నిదర్శనం ప్రణబ్... జగన్‌కు ఫోన్
చేయడమే అన్నారు.
గ్రామాలు, జిల్లాల స్థాయిలో రాజకీయ పునరేకిరణ
జరుగుతోందని మరో నేత పయ్యావుల కేశవ్ అన్నారు. 2014లో తామే అధికారంలోకి
వస్తామని చెప్పారు. రాయల తెలంగాణ వివాదం పెద్దలు పెట్టిన పంచాయతీ అని
మండిపడ్డారు. సాగునీటి విడుదలను ఎవరు రాజకీయే చేసినా క్షమించరాదన్నారు.
రైతుల జీవితాలతో ఆడుకునే నాయకులు రాజకీయాల్లో కొనసాగడానికే అనర్హులని
ధ్వజమెత్తారు.
ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రభుత్వ
నిర్ణయాలు ఉండకూడదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఖమ్మం జిల్లాలో
అన్నారు. సాగర్ జలాల నీటి విడుదలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి నీటి విడుదల ఉండాలన్నారు.
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
శ్రీశైలం,
నాగార్జున సాగర్‌లలో నీటి మట్టాలకు ఉన్న ఉత్తర్వులకు భిన్నంగా ప్రభుత్వం
వ్యవహరిస్తోందన్నారు. వెంటనే సాగర్ జలాల విడుదలను నిలిపివేయాలని డిమాండ్
చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన ఫ్యాక్స్ ద్వారా ఓ
లేఖను పంపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి