16 జులై, 2012

నేను సీతయ్య!: ఎవరు చెప్పినా విననన్న ముఖ్యమంత్రి



















తాను తలపెట్టిన కార్యక్రమం ప్రజలకు మంచి చేస్తుందని భావిస్తే తాను ఎవరు చెప్పినా వినే రకం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. కిరణ్ అమలాపురంలో ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజీవ్ యువకిరణాల ద్వారా రెండు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పనే ఆ పథకం లక్ష్యమన్నారు.

రాష్ట్ర యువత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. యువతకోసం ఏమైనా చేస్తామన్నారు. రాజీవ్ యువకిరణాలను అడ్డుకోవడానికి పలువురు పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ కూడా రాశారన్నారు. తాము ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పలేదన్నారు. యువతకు పదిహేను లక్షల ఉద్యోగాలు అంటే మొదట ఎవరూ నమ్మలేదన్నారు. ఇప్పుడు దానిని నెరవేర్చే దిశలో వెళుతున్నామని చెప్పారు.

ప్రస్తుతం 17 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకుందని చెప్పారు. విఆర్‌వో పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది పోస్టు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వారే అన్నారు. యువతకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది కాబట్టే వారు దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారని, ఎవరైనా ఏమైనా అంటే చెంప చెల్లుమని కొట్టే ధైర్యం వారిలో ఉందని, అయినప్పటికీ వారికి సెక్యూరిటీ కావాలన్నారు.

అందుకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. మంచి చేసేటప్పుడు ఎవరు చెప్పినా తాను వినే రకం కాదన్నారు. యువతకు మంచి జరుగుతుందంటే వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు. కాగా బండారులంక నేతన్నలకు సిఎం వరాల జల్లు కురిపించారు. వరద నీరు మళ్లింపు, రోడ్ల రిపేర్లకు రూ.కోటి మంజూరు చేశారు. పావలా వడ్డీ బకాయిల ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హతను బట్టి అంత్యోదయ కార్డులు మంజూరు చేస్తామన్నారు. నెలాఖరుకల్లా విద్యుత్ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.

కామెంట్‌లు లేవు: