11 జులై, 2012

కొడాలి నాని జంప్: టిడిపిలో అంత కలకలం ఎందుకు?




















విజయవాడ: పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా లేనంత కలకలం కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు వెళ్లిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. ఎందుకు ఇంతగా కలకలం చెలరేగుతుందనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌కు కొడాలి నాని అత్యంత సన్నిహితుడు కావడమే అందుకు కారణమా, మరేదైనా కారణం ఉందా అనే అలోచిస్తే, ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. మొదటగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మించిన నిమ్మకూరు ఈ నియోజకవర్గంలో ఉంది.

ఎన్టీ రామరావు కుటుంబ సభ్యులు ఆ నియోజకవర్గాన్ని తమ సొంతదిగా భావిస్తారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికే ఆ సీటు దక్కుతుంది. అలాగే, తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ సీటులో పార్టీలో ఓడిపోయింది. మూడు దశాబ్దాలుగా పార్టీకి అత్యంత విశ్వాసపాత్రంగా కార్యకర్తలు ఉంటూ వస్తున్నారు. ఎన్టీ రామారావు 1983, 1985ల్లో రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1989లో తప్ప ప్రతిసారీ ఓటర్లు తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తూ వచ్చారు.

కాంగ్రెసు అభ్యర్థి కఠారీ ఈశ్వర్ కుమార్ 1989 ఎన్నికల్లో సిట్టింగ్ తెలుగుదేశం శాసనసభ్యుడు రావి శోభనాద్రి చౌదరిని ఓడించారు. మళ్లీ 1994లో చౌదరి తన సీటును నిలబెట్టుకున్నారు. 2004 వరకు ఈ సీటు నుంచి శోభనాద్రి చౌదరి, ఆయన కుమారులు హరగోపాల్, వెంకటేశ్వర రావు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రెండు ఉప ఎన్నికల్లో కూడా రావి కుటుంబం ఈ సీటు నుంచి విజయం సాధించింది.

కొడాలి నాని 2004లో కాంగ్రెసు గాలిలో కూడా గుడివాడ నుంచి విజయం సాధించారు. గుడివాడ సీటు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. పార్లమెంటు సీటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి బాడిగ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యను ఓడించారు. అయినా గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొడాలి నాని విజయం సాధించారు. 2009లోనూ కొడాలి నాని విజయం సాధించారు.

అకస్మాత్తుగా కాకున్నా, చాలా సమయం తీసుకుని కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడడం పట్ల తెలుగుదేశం పార్టీలో కలకలం చెలరేగుతోంది. ఎన్టీ రామారావు పుట్టిన గడ్డలో తెలుగుదేశం పార్టీకి మోసం జరిగిందనే అభిప్రాయం మాత్రమే కాకుండా ఆ స్థానం తమది కాకుండా పోతుందా అనే అనుమానం కూడా వారిలో కలుగుతోంది. దాంతోనే ఇంతగా కలకలం చెలరేగుతోంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ippudu umDE T.D.P ramaarao gaaridi kaadu kadamDee?