15 జులై, 2012

మంత్రిగారి మహా బూతు పురాణం




















మంత్రిగారు మహా బూతుపురాణం విప్పారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ కొంత మంది నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థలకాలాలు మరిచిపోయి ఆయన తిట్ల దండకం అందుకున్నారు. "పదిమంది లేరు. సీఎం డౌన్ డౌన్ అంటారా..? చిన్నదానికి, పెద్దదానికి సీఎంను తిడతారా..? మీ సంగతి చూస్తా..'' మీదికెళ్లి తన్నిస్తా!'' అని ఆయన చిందులేశారు.

ఆ మాటలు చాలా తక్కువే. అంతకు మించిన తిట్ల దండకం అందుకున్నారు. 'సీఎం డౌన్‌డౌన్' అంటూ నిరసన వ్యక్తం చేసినందుకు ఆయన మండిపోయారు. రాయడానికి వీల్లేని భాషలో తిడుతూ వీరంగం వేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 53మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంత్రి వీరిని పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో పలు విద్యార్థి, మహిళా సంఘాలు, పార్టీల నాయకులు 'సీఎం డౌన్ డౌన్' అని నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేప్పుడూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన సహనం కోల్పోయి నోటికి పనిచెప్పారు.

మంత్రిగారి భాషకు విస్తుపోవడం అందరి పని అయింది. నిరసనకారులు కూడా దిమ్మ తిరిగిపోయి చూస్తూ ఉండిపోయారు. తమతో ఏదో మాట్లాడుతారని అనుకుంటే, ఇదేమిటంటూ నిరనసకారులు కోపగించుకున్నారు.

కామెంట్‌లు లేవు: