18 జులై, 2012

కెసిఆర్‌కు జగన్ సవాల్: కెటిఆర్ కోటలో అడుగు























సీమాంధ్రలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ముప్పుతిప్పలు పెడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన దృష్టిని తెలంగాణ పైకి మరల్చారు. ఓ వైపు సీమాంధ్రలో తన వ్యూహాలను అమలుపరుస్తూనే మరోవైపు తెలంగాణలో అడుగుపెట్టి 2014 నాటికి ఆ ప్రాంతంలో పుంజుకోవాలని ప్రణాళికతో వెళుతున్నారు. అందులో భాగంగానే తన తల్లితో సిరిసిల్లలో దీక్షకు దింపుతున్నారని అంటున్నారు.

పరకాల ఇచ్చిన ఊపుతో తెలంగాణలో పాగా వేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. తెరాస బలంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఆ పార్టీ ఓడించినంత పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణలో అడుగుపెట్టి పరకాలలో ఎన్నికల ప్రచారం చేసిన ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మరో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత ధర్నా చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.

నేత కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిపించటానికే ధర్నా తలపెట్టినట్టు ఆ పార్టీ నేత మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. పేరుకు చేనేత అయినా లక్ష్యం మాత్రం గులాబీ పార్టీకి ఎదురెళ్లడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దానికి తగినట్టే, టిఆర్ఎస్ కోట సిరిసిల్లను ఎంచుకోవటం, అది కూడా కెసిఆర్ తనయుడు కెటి రామారావు సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. పార్టీ పెట్టాక తెలంగాణలో హైదరాబాద్ వెలుపల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోనే ఆ పార్టీ అడుగు పెట్టగలిగింది.

ఆర్మూర్‌లో జగన్ 48 గంటల రైతు దీక్ష చేశారు. ఆ తర్వాత జరుగుతున్న కార్యక్రమమే కాదు.. ఉత్తర తెలంగాణలో ఇదే జగన్‌పార్టీకి తొలి అడుగు. 2009 ఎన్నికల్లో సిరిసిల్లలో టిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మహేందర్‌ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడాయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. నాడు కెటిఆర్ కేవలం 171 ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మహేందర్ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమం, రాజీనామాల నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి మహేందర్‌ను కెటిఆర్ ఓడించారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను వీడి వైయస్సార్ కాంగ్రెసులో చేరారు.

ఈ నేపథ్యంలో చేనేత ధర్నాను విజయవంతం చేసే పనిని మహేందర్ తన భుజాలకు ఎత్తుకోవడం చూస్తుంటే, టిఆర్ఎస్‌తో అమీతుమీకి సిద్ధపడినట్లేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా, జగన్ పార్టీకి ఈ ప్రాంతంలో స్థానం లేకుండా చేస్తామని ఈమధ్యనే ఐకాస ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సిరిసిల్లలో జగన్ పార్టీ చేనేత ధర్నాకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

కామెంట్‌లు లేవు: