12 ఫిబ్ర, 2012

తెలంగాణ ఉప ఎన్నికలు - కిరణ్.. బొత్సలకు అగ్నిపరీక్షే!!!

రాష్ట్ర అసెంబ్లీలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రెండు దశల్లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు.. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు (మొత్తం ఏడు స్థానాలు) ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. 

అయితే, ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణలకు అగ్నిపరీక్షలా మారనున్నాయి. ఎందుకంటే.. తెలంగాణలో తెరాస అధినేత కేసీఆర్, సీమాంధ్రలో వైఎస్.జగన్మోహన్ ప్రభంజనం కొనసాగుతుందని అనేక సర్వేలు ఘోషిస్తున్న నేపథ్యంలో.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు వీరికి కఠిన పరీక్షలా మారాయి. 

అదేసమయంలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమానికి ఊపిరి పోస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఈ ఎన్నికలు ఒక సవాల్‌లా మారాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లో ఒక్క సీటును తెరాస కోల్పోయినా అది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆరు స్థానాల్లో విజయం సాధించి ఉద్యమ తీవ్రత తగ్గలేదని చాటి చెప్పాలని తెరాస చీఫ్ కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు.

ఇకపోతే.. తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయినట్టుగా ప్రచారం సాగుతున్న తెలుగుదేశానికి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. నిజామాబాద్, బాన్సువాడ ఉప ఎన్నికల్లో డిపాజిట్‌లను కోల్పోయిన తెదేపా.. ఈ దఫా తమ స్థానాలైనా దక్కించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఇకపోతే.. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో గెలుపు దక్కితే అది ఆత్మస్థైర్యాన్ని నింపనుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ చీఫ్‌కు బొత్స సత్యనారాయణకు అగ్నిపరీక్షలా మారాయి.

కామెంట్‌లు లేవు: