15 ఫిబ్ర, 2012

భవానీ ద్వీపంపై వివరణ ఇవ్వండి: లోకాయుక్త ఆదేశం

హైదరాబాద్: కృష్ణా జిల్లా భవానీ ద్వీపంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక శాఖ వైస్ చైర్మన్, ఎండిని లోకాయుక్త మంగళవారం ఆదేశించింది. మంత్రి గంటా శ్రీనివాస రావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి భవానీ ద్వీపం కాంట్రాక్టు లభించిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదమైంది. ఈ ద్వీపం కాంట్రాక్టులు గంటా కంపెనీకి దక్కడంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఈ ద్వీపం కాంట్రాక్టుపై ఈ నెల 28న లోకాయుక్త ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని టూరిజం వైస్ చైర్మన్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన జివోలు తదితరాలు కూడా తీసుకు రావాలని సూచించింది. లీజు ఉత్తర్వులు పొందకుండానే సుచిర్ ఇండియాతో ప్రత్యూష అసోసియేట్స్ షిప్పింగ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకోవడంపై లోకాయుక్త ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా భవానీ ద్వీపాన్ని లీజుకు ఇవ్వడంపై సాయికృష్ణ ఆజాద్ అనే న్యాయవాది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జివో 148 ప్రకారం భవానీ ద్వీపంలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాలని, కానీ అందుకు విరుద్ధంగా పర్యాటక శాఖ టెండర్లు పిలిచిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఇందులో ఇరవై శాతం శాశ్వత నిర్మాణాలకు అనుమతించడం చెల్లదని అందులో తెలిపారు. మూడు టెండర్లు వచ్చాయని, అందులో రెండు నామమాత్రమేనని అన్నారు. ప్రత్యూష రూ.289.87 కోట్లకు టెండరు వేయగా, మరో రెండు కంపెనీలు రూ.33.21, రూ25.52 కోట్లకు మాత్రమే టెండరు వేయడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై లోకాయుస్త జస్టిస్ ఆనంద రెడ్డి విచారణ చేపట్టారు.

కామెంట్‌లు లేవు: