9 ఫిబ్ర, 2012

చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్: కిరణ్‌పై డిఎల్ రవీంద్ర ఫైర్

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి గురువారం మరోసారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను బలి చేశారని డిఎల్ ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రిని రక్షించడానికి సిఎం బిసి సామాజిక వర్గానికి చెందిన మోపిదేవిని బలి చేశారన్నారు. ఆయన బిసి అయినందునే ఇరికించారన్నారు. మోపిదేవి లంచాలు తీసుకునే వ్యక్తి కాదన్నారు. మోపిదేవి వయస్సులో చిన్నవాడు అని, ఆయనకు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని, ఇలాంటి వ్యక్తిని టార్గెట్ చేసుకోవడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరగరానివి ఎన్నో జరుగుతున్నావని ఆయన అన్నారు. ఉన్నతస్థాయి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో కమిషనర్లను నియమించినప్పుడు కాంగ్రెసు నేతలను దొంగల పార్టీ అన్న బాబు ఈసారి మాత్రం ఏమీ మాట్లాడలేదన్నారు. ఇప్పుడేమో డీసెంట్ నోట్ రాశారన్నారు.

బాబు, సిఎం మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మోపిదేవిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాగా డిఎల్ రవీంద్రా రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 108, 104 వ్యవహారం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన లేఖ రాశారు. డిఎల్ 108పై ముఖ్యమంత్రితో విభేదిస్తున్న విషయం తెలిసిందే. సిఎం వ్యవహార శైలిపై ప్రధానంగా ఆయన లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. సిఎం పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కయ్యారని అందులో పేర్కొన్నట్లుగా సమాచారం

కామెంట్‌లు లేవు: