డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కేన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఆయన ఎడమ ఊపిరితిత్తి బయట కేన్సర్ కణితి ఉన్నట్టు కుటుంబ వైద్యుడు జతిన్ చౌదరి ఆదివారం ప్రకటించారు. అయితే పరిస్థితి ప్రమాదకరమేమీ కాదని యువరాజ్ మే నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతాడని తెలిపారు. 2011 తొలినాళ్లలో.. తరచూ అస్వస్థతకు గురవుతున్న యువరాజ్ వైద్యులకు చూపించుకోగా ఎడమ ఊపిరితిత్తి బయట కణితి ఉన్నట్టు తేలింది. అక్టోబర్‌లో దాన్ని ఊపిరితిత్తుల కేన్సర్‌గా గుర్తించారు. యువీ అమెరికాలో కీమో థెరపీ తీసుకుంటున్నాడు. మూడు సిట్టింగుల్లోనే నయమవుతుందని వైద్యులు ప్రకటించారు.
37 టెస్టుల్లో 34.80 సగటుతో 1775 పరుగులు సాధించిన ఈ పంజాబ్ బ్యాట్స్‌మన్, 274 వన్డేల్లో 37.62 సగటుతో 8051 పరుగులు చేశాడు. 23 టి -20ల్లో 567 పరుగులు సాధించాడు.
ఆల్‌రౌండ్‌షోతో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన యువీ ఊపిరితిత్తుల కేన్సర్ బారినపడ్డాడు. జట్టు గెలుపుకోసం అహర్నిశలూ కష్టపడే ఈ ఆల్‌రౌండ ర్ ఇప్పుడు కేన్సర్ మహమ్మారిని జయించేందుకు పోరాడుతున్నాడు. గతంలో ఊపిరి తిత్తుల్లో గుర్తించిన కణితి.. కేన్సర్‌గా మారిందని అతని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జతిన్ చౌదరి ఆదివారం తెలిపాడు.
ఊపిరితిత్తుల్లో కణితికి చికిత్స తీసుకుంటున్న యువీకి కేన్సర్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతడు బోస్టన్ (అమెరికా)లోని కేన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడని చౌదరి పేర్కొన్నాడు. అయితే యువీకి సోకిన వ్యాధి తీవ్రమైనదే అయినా స్టేజ్-1లోనే గుర్తించడంతో త్వరగానే నయమయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపాడు. 'ఇది అరుదుగా ఏర్పడే కణితి. ఎడమ ఊపిరితిత్తిలో ఈ కణితి ఏర్పడింది. అది కేన్సర్‌గా మారింది. ఇది పగిలే అవకాశం ఉన్నందున ప్రమాదకరమే.
కానీ దీన్ని 100 శాతం తగ్గించొచ్చు. దీంతో ప్రాణానికిగానీ, కెరీర్‌కుగానీ వచ్చిన ప్రమాదమేమీ లేదు. తొలిదశలోనే గుర్తించాం కాబట్టి కీమోథెరపీతో నయం చేయొచ్చు' అని జతిన్ వివరించాడు. దీంతో యువీ జనవరి 26న అమెరికా బయల్దేరి వెళ్లినట్టు ఆయన చెప్పాడు. మార్చి చివరినాటికల్లా యువీ కోలుకుంటాడని, ఏప్రిల్‌లో పునరావాసం అనంతరం మే నెలకల్లా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని తెలిపాడు.
ఆయుర్వేద చికిత్స కూడా..: కేన్సర్‌తో పోరాడుతున్న యువరాజ్ దా న్ని జయించేందుకు ఆయుర్వేద చికిత్స కూడా తీసుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో వ్యాధిని గుర్తించిన వైద్యులు తొలుత ఆరు సిట్టింగ్‌ల కీమోథెరపీ అవసరమవుతుందేమోనని భయపడ్డారు. అయితే ఆయుర్వేదం తీసుకోవడం వల్ల మూడు సిట్టింగ్‌లే అవసరమని నిర్ణయించారు. మూడో సిట్టింగ్ తర్వాత పూర్తిగా కోలుకోవడానికి 30-45 రోజులు పడుతుంది. 'యువీ మానసికంగా చాలా బలంగా ఉన్నాడు. కుటుంబ సభ్యు లు, మిత్రులతోపాటు అతని గురూజీ కూడా అండగా నిలిచారు.
అయితే శస్త్రచికిత్స అవసరం రానందుకు సంతోషంగా ఉంద'ని జతిన్ అన్నాడు. కాగా, గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో యువీదే కీలకపాత్ర. బ్యాటింగ్‌లో 362 పరుగులు చేయడమే కాకుండా 15 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టి భారత్‌ను జగజ్జేతగా నిలిపిన యువీ 'మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్'ను అందుకున్నాడు.
ముందే గుర్తించాల్సింది: యువీ అనారోగ్యంతో ఉన్నప్పుడు తీయించిన బయాప్సీ రిపోర్టు కారులో పోయిందని, అనంతరం భారత్‌లోని మరో ఆస్పత్రిలో మరోసారి పరీక్ష చేయించామని జతిన్ తెలిపాడు. ఆ ఆస్పత్రిలో వ్యాధిని సరిగా గుర్తించలేదన్నాడు. అయితే ఓ రష్యన్ డాక్టర్ కేన్సర్ ఉన్నట్టు నిర్దారించారని, అమెరికాలోని డాక్టర్లతో మాట్లాడిన తర్వాత కీమోథెరపీ అవసరమని నిర్ణయించారని జతిన్ వివరించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి