8 ఫిబ్ర, 2012

సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో రాజీకి డిఎల్ నో, ఫైటింగే

కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, ఇతర నాయకుల జోక్యంతో రాజీనామా యోచనను విరమించుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సమరానికే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. రాజీనామా చేయబోనని చెప్పడానికి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. పేరెత్తకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సొంత కాంగ్రెసు పార్టీ నాయకులను కూడా తప్పు పట్టారు. ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నవారు తమ పార్టీలో ఉన్నారని, వారి వల్లనే సమస్య ఎదురవుతోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతిపై ఉమ్మడిగా పోరాడుదామనే అవగాహనతోనే తాను కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరానని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అర్థమవుతోంది.

తాను ఢిల్లీకి సూట్‌కేసులు మోయలేదని ఆయన అన్నారు. మిగతావాళ్లు మోస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన ఈ మాటలు మాట్లాడారు. పైగా, మంత్రిగా కొనసాగడానికి అంగీకరించినప్పటికీ ఆయన సచివాలయానికి వెళ్లడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఆయన గత మంత్రి పి. శంకర రావు దారిలోనే నడవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారిని కూడగట్టాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల శానససభల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిపై తన సమరాన్ని పెంచాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

పి. శంకరరావు మంత్రిగా కొనసాగుతూనే కిరణ్ కుమార్ రెడ్డిపై సమరం సాగించారు. ముఖ్యమంత్రిపై పలు బహిరంగ విమర్శలు చేశారు. మంత్రి వర్గ సమావేశాలకు కూడా వెళ్లలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొంత మంది సభ్యులపై నేరుగా సమరానికి దిగారు. అదే పంథాను డిఎల్ రవీంద్రా రెడ్డి అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారిని కిరణ్ కుమార్ రెడ్డి సహించడం లేదనే అభిప్రాయం బలపడే విధంగా ఆయన వ్యవహరించే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు: