8 ఫిబ్ర, 2012

అయేషా టకియా సోదరికి విజయ్ మాల్యా క్షమాపణలు

న్యూఢిల్లీ: తన సోదరి నటాషా పట్ల కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బాలీవుడ్ నటి అయేషా టకియా ట్వీట్ చేసింది. ఆ సంఘటనపై ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపింది. అయేషా టకియా ట్విట్‌కి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా సమాధానం ఇచ్చారు. ఫిర్యాదును తన తండ్రి తీవ్రంగా తీసుకుంటున్నారని, టకియా నటీమణులకు క్షమాపణ చెబుతున్నారని, ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. విజయ్ మాల్యా కూడా సంఘటనకు స్పందిస్తూ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. 

తమ సేవల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే తాను అయేషా టకియా సోదరి నటాషాకు క్షమాపణలు చెబుతున్నానని, ఈ సంఘటనపై విచారణ జరిపిస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడే తాను విజయ్ మాల్యా ట్వీట్ చూశానని, ప్రతిస్పందనకు సంతోషిస్తున్నానని, సంఘటనను తీవ్రంగా పరిగణిస్తారని అనుకుంటున్నానని అయేషా టకియా సమాధానమిచ్చారు. తన సోదరి నటాషా పట్ల కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారంటూ అయేషా టకియా సోమవారం ట్విట్టర్‌లో రాశారు. అయితే, తాము నటాషా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. నటాషా ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే, ఢిల్లీకి మరో ఎయిర్‌లైన్ విమానంలో వచ్చారని, ఆ విమానం ఆలస్యంగా వచ్చిందని, దాంతో ముంబై కనెక్షన్ దెబ్బ తిన్నదని వివరణ ఇచ్చింది. 

తాము మరో విమానం వచ్చే దాకా ఆగాలని నటాషాకు చెప్పామని, వెయిటింగ్ లిస్టులో పెట్టామని, అయితే తరువాత వచ్చిన విమానం పూర్తిగా నిండిపోయిందని, అదే విషయం చెప్పామని వివరణ ఇచ్చింది. ఆమె బోర్డింగ్ కార్డు తమ సిబ్బంది చింపేశారనే ఆరోపణలో నిజం లేదని, అసలు బోర్డింగు కార్డు ఆమెకు ఇవ్వనేలేదని చెప్పింది. కేవలం కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్ కావడం వల్ల జరిగిన వ్యవహారమే తప్ప నటాషా ఆరోపణల్లో నిజం లేదని వివరించింది.

కామెంట్‌లు లేవు: