3 మార్చి, 2012

గాలి కోట రహస్యం: ఎవరీ అలీఖాన్?



                                       Alikhan
అక్రమ గనుల తవ్వకాల కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఆయన వ్యక్తిగత సహాయకుడు (పిఎ) అలీఖాన్ మిస్టరీగా మారాడు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన గట్టుమట్లన్నీ అలీఖాన్‌కు తెలుసునని భావిస్తూ వస్తున్నారు. అనూహ్యంగా బెంగుళూర్ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డిని ప్రవేశపెట్టే సమయంలో అలీఖాన్ కోర్టులో లొంగిపోయారు. గాలి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకే అతను లొంగిపోయినట్లు భావిస్తున్నారు. ఇంతకీ ఆ అలీఖాన్ ఎవరు, ఎలా గాలి జనార్దన్ రెడ్డికి దగ్గరయ్యాడనేది ఆసక్తికరంగా మారింది. అలీఖాన్ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందినవాడు. ఆయన భార్య డాక్టర్. తండ్రి రైల్వే ఉద్యోగి. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అలీఖాన్ గాలి ప్రాపకం సంపాదించిన తర్వాత కోట్లకు పడగలెత్తాడు. 

తెలిసిన సమాచారం ప్రకారం - బళ్లారిలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో మాజీ మంత్రి శ్రీరాములు మేనల్లుడు, ప్రస్తుత కంప్లి శానససభ్యుడు సురేష్ బాబుతో అలీకి స్నేహం ఏర్పడింది. ఇంజనీరింగ్ చదువు పూర్తయిన తర్వాత వారిద్దరు గాలి జనార్దన్ రెడ్డి వద్ద చేరి వ్యాపార లావాదేవీలు నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. 2008లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి తరఫున వారు ప్రచారం చేశారు. అప్పుడే అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డి విశ్వాసాన్ని చూరగొన్నాడు. 

గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల్లో అనతి కాలంలోనే అలీఖాన్ కీలకవ్యక్తిగా మారాడు. మైనింగ్ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడని అంటారు. దాంతో కొద్ది కాలంలోనే అతను కోట్లకు పడగలెత్తినట్లు చెబుతారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆయన ఇంటిపై రెండు సార్లు దాడులు చేశారు. నిరుడు సెప్టెంబర్ 5వ తేదీన గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ అరెస్టు చేసినప్పటి నుంచీ అతను కనిపించకుండా పోయాడు. అతని కోసం సిబిఐ లుకవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అనూహ్యంగా శుక్రవారం కోర్టులో లొంగిపోయి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

కామెంట్‌లు లేవు: