హైదరాబాద్: ఉప ఎన్నికలు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ శానససభ్యుడు చెన్నకేశవ రెడ్డి అన్నారు. తమపై స్పీకర్ వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్న మాజీ శాసనసభ్యులు స్వాగతిస్తున్నారు. వేటుకు గురైన శ్రీకాంత్ రెడ్డి, పన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీనివాసులు, చెన్నకేశవ రెడ్డి తదితరులు శనివారం వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలకు తాము భయపడడం లేదని వారన్నారు. రైతుల కోసం పదవి పోయినందుకు తమకు గర్వంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు జరిగే 17 సీట్లు కూడా తమవేనని ఆయన అన్నారు.
కాంగ్రెసు 17 సీట్లలో ఓడిపోతుందని, తాము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఆయన అన్నారు. వైయస్సార్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు ప్రజల పార్టీ అని, ప్రజలే తమ అధిష్టానమని వైయస్సార్ కాంగ్రెసు మాజీ శానససభ్యులు అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తనకు కష్టాలు వస్తాయని తెలిసి కూడా, పదవులు ఇస్తామని ఆశ పెట్టినా యువకులకు దశ, దిశ చూపించడానికి వైయస్ జగన్ ముందుకు వచ్చారని ఆయన అన్నారు. మార్పు తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంపై ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
తాను ఎవరి మీదనైనా గెలుస్తానని, బంధుత్వం బంధుత్వమే - రాజకీయం రాజకీయమేనని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ శానససభ్యుడు ధర్మాన కృష్ణదాసు అన్నారు. 17 నియోజకవర్గాల్లో కడప ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని వేటు పడిన వైయస్ జగన్ వర్గం మాజీ శానససభ్యులు అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారన్నారు. ఉప ఎన్నికల ద్వారా కాంగ్రెసుకు కనువిప్పు కలిగిస్తామని ప్రసాద రాజు అన్నారు. ఆలస్యంగానైనా తమపై స్పీకర్ వేటు వేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి