నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరిని కలిపి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్, కెసిఆర్‌లను కలిపి విమర్శించారు. జగన్, కెసిఆర్ లాలూచీ పడి అవినీతి సొమ్మును పంచుకొని ఉప ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారని ఆరోపించారు. వారిద్దరూ రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. అవినీతిపరులను అందలమెక్కిస్తే రాష్ట్రం అధోగతి అవుతుందని హెచ్చరించారు. ధన వ్యామోహం వల్లే కొవ్వూరుకు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. రాజకీయాల్లో విశ్వాసం ముఖ్యమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి విశ్వాసం లేదని, అలాంటి విశ్వాసంలేని వ్యక్తిని ఓడించాలని సూచించారు. సంతలో పశువులను కొన్నట్లు జగన్ ఎమ్మెల్యేలను కొని రాజీనామా చేయించి జగన్ ఉప ఎన్నికలకు కారణమయ్యారన్నారు.
జగన్ అక్రమాలకు పాల్పడినప్పుడే ఆయన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అది తప్పని చెబితే బాగుండేదన్నారు. జగన్‌కు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమన్నారు. అధికార కాంగ్రెసు పార్టీ పైనా బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఆదాయం లేక అప్పుల కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అవినీతి, అక్రమాలకు ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు. అధికారంలో కాంగ్రెసు వంటి అసమర్థ పార్టీ ఉండటం వల్లనే పాలన దారుణంగా ఉందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి