20 మార్చి, 2012

చిరంజీవి ఎంపిక: కిరణ్ కుమార్‌ను కాదన్న సోనియా

                                       Chiranjeevi

రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తోసిపుచ్చినట్లు సమాచారం. రాజ్యసభకు ఎంపిక చేయడం కన్నా చిరంజీవిని రాష్ట్రంలో ఉంచితేనే పార్టీకి మంచిదని, అవసరమైతే డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి వచ్చే ఎన్నికల కోసం చిరంజీవిని తురుపు ముక్కగా వాడుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు విన్నవించినట్లు చెబుతున్నారు. అయితే, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు చిరంజీవికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అంతకన్నా ముఖ్యమని సోనియా చెప్పారని అంటున్నారు. 

రాజ్యసభకు ఎంపిక చేయించి, కేంద్ర మంత్రి పదవి ఇస్తామని పార్టీ విలీనానికి అంగీకరించిన సమయంలో చిరంజీవికి హామీ ఇచ్చామని, ఆ హామీని నిలబెట్టుకోవడానికి చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తున్నామని ఆమె చెప్పారని అంటున్నారు. చిరంజీవిని రాష్ట్రంలో ఉంచడానికి ఆయన మరో వాదనను కూడా ముందుకు తెచ్చారని అంటున్నారు. రాజ్యసభకు ఎంపిక కావడం వల్ల చిరంజీవి తిరుపతి శాసనసభా సభ్యత్వానికి చిరంజీవి రాజీనామా చేయాల్సి ఉంటుందని, అలా ఖాళీ అయితే తిరుపతి నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా కష్టమవుతుందని ఆయన సోనియాకు వివరించారని అంటున్నారు.

ముఖ్యమంత్రి వాదనకు సోనియా తీవ్రంగా ప్రతిస్పందించారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయడం వల్ల ఖాళీ అయిన 17 స్థానాల్లో గెలుస్తామా, అన్ని విధాలా ప్రయత్నాలు చేయండి, ఫలితాలు చూద్దాం అని ఆమె కిరణ్ కుమార్ రెడ్డికి చురక వేసినట్లు చెబుతున్నారు. 

కామెంట్‌లు లేవు: