9 మార్చి, 2012

సిఎం కోవూరు సభలో రికార్డు డ్యాన్స్‌ల జోరు

                                    Kiran Kumar Reddy
నెల్లూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోవూరు ఎన్నికల ప్రచార సభ రికార్డు డ్యాన్స్‌లతో హోరెత్తింది. సభకు వచ్చిన ప్రజలను అలరించేందుకు యువతీయువకులతో కాంగ్రెసు నాయకులు రికార్డు డ్యాన్సులు చేయించారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రావడం కాస్తా ఆలస్యం కావడంతో కాంగ్రెసు నాయకులు రికార్డు డ్యాన్సులు పెట్టించారు. రోషమున్న కుర్రాళ్ల కోసం.. వంటి సినిమా పాటలకు యువతీయువకులు జోరుగా నృత్యాలు చేశారు. ఆ తర్వాత సభకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 

తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దని ఆయన ఓటర్లకు హితవు చెప్పారు. కోవూరు ఎన్నికలు చరిత్ర సృష్టించే ఎన్నికలని, తమ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఉందని చెప్పడానికి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

తమ కాంగ్రెసు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గెలిపిస్తే కోవూరును తన నియోజకవర్గం చూసుకుంటున్నట్లు చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఇవి మామూలు ఎన్నిక కాదని, అందుకే కాంగ్రెసుకు ప్రజలు ఓటేయాలని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు: