1 మార్చి, 2012

కాటేజ్‌లో రాసలీలలు - లడ్డూలో గుట్కాలు

                                  AA
తిరుమలలో భక్తిభావం కొండెక్కింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కొందరు వ్యభిచార కేంద్రంగా మార్చేశారు. అటు, పోటు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లడ్డూల్లో గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న క్షేత్రంలో ఇలాంటి అపచారాలు పదేపదే జరుగుతుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. 

TTD నిర్లక్ష్య వైఖరికారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న వాదన నానాటికీ బలపడుతోంది.తిరుమల లడ్డూ అంటే సాక్షాత్తూ వెంకన్నే ప్రసాదించిన వరంగా భావిస్తారు భక్తులు. ఈ లడ్డూని బంధువులకు, స్నేహితులకు పంచి వారినీ శ్రీనివాసుని కృపకు పాత్రుల్ని చేస్తారు. మరే ఇతర ప్రసాదంలోనూ దొరకని రుచికి, 
శ్రేష్టతకు మారుపేరుగా చెప్పే ఈ లడ్డూను అత్యంత నియమ నిష్టలతో తయారు చేస్తారు. 

కానీ అదంతా గతం. ఇప్పుడు లడ్డూల్లో ఊహించని వస్తువులు దర్శనమిస్తున్నాయి. గుట్కా ప్యాకెట్లు సైతం.. అందులో ఉంటున్నాయి. పోటు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రవీణ్ అనే భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూల్లో ఈ గుట్కా ప్యాకెట్లు దొరకడంతో అతను TTDకి ఫిర్యాదు చేశాడు. తీరిగ్గా ఇప్పుడు ఈ ఘటనపై విచారణ మొదలెట్టారు.

ఇటు, తిరుమల సప్తగిరి అతిథి గృహాన్ని వ్యభిచారకేంద్రంగా మార్చేశాడు ఓ కాంగ్రెస్ నేత కుమారుడు. పాడు పనులకు ఎక్కడా చోటు దొరకనట్టు ఏకంగా కాటేజ్‌లోనే దుకాణం పెట్టాడు. వీరి ప్రవర్తనతో అనుమానమొచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. స్థానిక కాంగ్రెస్ నేత దాము కుమారుడు సూరి... సప్తగిరిలోని 235 నెంబర్ గదిలో ఓ మహిళతో పట్టుబడ్డాడు. 

అంతా ఛీకొట్టే తప్పు జరిగిందని తెలిసినా.. కుమారుడిని కాపాడేందుకు ఆ కాంగ్రెస్ నేత ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు కాకుండా పైరవీలు చేస్తున్నారు. తిరుమల ప్రతిష్ట మంటగలిపేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.



కామెంట్‌లు లేవు: