హైదరాబాద్: తిరుమల పుణ్యక్షేత్రంపై జివో తెచ్చినందుకే ఓ ముఖ్యమంత్రి పోయారని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు శుక్రవారం మండలిలో మండిపడ్డారు. పెద్దల సభ మండలి కూడా శుక్రవారం శాసనసభను తలపించింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు దాడి వీరభద్ర రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. ఓ సమయంలో పొంగులేటి మాట్లాడుతూ.. టిటిడిపై రాజకీయం చేసినందుకే అలిపిరి ఘటన జరిగిందని ఆయన అన్నారు. దాడికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. దీనికి టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై దాడి ఒంటి కాలిపై లేచారు.
శ్రీ వేంకటేశ్వర స్వామికి చెందిన ఏడు కొండలలో ఐదు కొండలపై జివో తీసుకు వచ్చినందుకే ఓ ముఖ్యమంత్రి పోయారని దాడి ధ్వజమెత్తారు. దేవుడి సొమ్ము ముట్టుకుంటే ఎవరైనా నాశనమవుతారని అన్నారు. వేంకటేశ్వర స్వామిని తాకితే బతికి బట్ట కట్టరన్నారు. టిటిడిలో అవినీతిని సహించేది లేదన్నారు. దేవుడు సొమ్ము స్వాహా చేసేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తుందన్నారు. మీకు సిగ్గులేదా మీరు దేవుడి గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ఆయనను పొంగులేటి ప్రతిఘటించే ప్రయత్నాలు చేశారు. దీంతో దాడి నువ్వెవరు మాట్లాడటానికి సభలో రౌడీయుజం చేస్తున్నావా, యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. దేవుడి సంపద స్వాహా చేస్తే కాంగ్రెసుకు పుట్టగతులు ఉండవన్నారు. కాగా చైర్మన్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి