హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో మండిపోయిన రాష్ట్ర ప్రజలకు ఒక్కసారిగా ఊరట
లభించింది. ఆదివారం రాత్రి వరుణదేవుడు రాష్ట్ర ప్రజలను కరుణించాడు. నైరుతి
రుతుపవనాల వేగం ఒక్కసారిగా పెరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే
రాష్ట్రం మొత్తానికి అవి విస్తరించాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలు
జిల్లాల్లో ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాజధాని
హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారానికి ఉత్తర బంగాళాఖాతంలో
ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
రానున్న రెండు రోజుల్లో ఇది మరింత బలపడి
అల్పపీడనంగా మారనుంది. దీంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలేందుకు
వాతావరణం అనుకూలంగా మారింది. పది పన్నెండు రోజుల ఆలస్యంగా శనివారం
అనంతపురంలో ప్రవేశించిన రుతుపవనాలు ఆదివారానికి రాష్ట్రంలో మిగిలిన
ప్రాంతాలకు విస్తరించాయి. ఒకపక్క పశ్చిమ తీరంలో గుజరాత్ నుంచి కేరళ తీరం
వరకు ద్రోణి, అరేబియాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో కేరళ, కర్ణాటక,
కొంకణ్, విదర్భ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో విస్తారంగా,
తెలంగాణ, కోస్తా, మహారాష్ట్రల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఇంకా ఆదివారం
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రుతుపవనాలు రెండు రోజుల వ్యవధిలోనే
శరవేగంగా ముందుకు కదిలాయి.
రానున్న మూడు రోజుల్లో అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, మధ్య మహారాష్ట్ర, విదర్భ, ఒడిసా, పశ్చిమబెంగాల్, సిక్కింలో మిగిలిన ప్రాంతాలు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయన్నారు. రానున్న రెండు రోజుల్లో ఇది అల్పపీడనంగా మారనున్నదని, దీంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
హైదరాబాద్‌లో
ఆదివారం సాయంత్రం భారీవర్షం పడింది. రాత్రి 8.30 వరకు 2.5 సెంటీమీటర్ల
వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీ
మైత్రి ఆస్పత్రి ఎదురుగా వర్షపు గాలి తాకిడికి ఓ భారీ వృక్షం విరిగి
రోడ్డుపై పడింది. గోద్రెజ్ చౌరస్తా వద్ద చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై
పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు బస్తీలు, లోతట్టు
ప్రాంతాల్లోకి నీరుచేరి ఇళ్లలోకి కూడా వెళ్లింది. నాలాలు ఏరులై పారాయి.
వర్షం వల్ల పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఆదివారం ఉదయం నుంచే మహబూబ్‌నగర్
జిల్లా వ్యాప్తంగా చల్లటి వాతావరణం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో భారీగా,
మరికొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట,
దామరగిద్ద, ఉట్కూరు, మక్తల్, మాగనూరు, భూత్పూరు, నవాబుపేట, ప్రాంతాల్లో
మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడ్డాయి. మహబూబ్‌నగర్‌లో సాయంత్రం నుంచి
రెండు గంటల పాటు వర్షం కురిసింది. పాలమూరు పట్టణంలో సాయంత్రం ఆరున్నర
ప్రాంతంలో ప్రారంభమైన జల్లులు రాత్రి 8 గంటల వరకు కురుస్తూనే ఉంది.
ఆత్మకూరు,
శ్రీశైలం ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కాగా బనగానపల్లె,
ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, పత్తికొండ, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో
చిన్న పాటి వర్షపాతం నమోదైంది. ఇక నెల్లూరుజిల్లా నాయుడుపేట, గూడూరు,
నెల్లూరులలో ఆదివారం రాత్రి చిరుజల్లులు కురిశాయి. జిల్లా అంతా వాతావరణం
చల్లబడి ఆకాశం మేఘావృతమైంది. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతో ఏలూరులో రహదారులన్నీ
జలమయమయ్యాయి. ఈదురుగాలులు బలంగా వీయడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు
నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్‌కు అంతరాయం
ఏర్పడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి