18 జూన్, 2012

మందా వర్సెస్ అరుణ: ఇరు పక్షాల మధ్య దాడులు




















మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి డికె అరుణ, నాగర్‌కర్నూలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలతో దాడులు చేసుకునే వరకు ఆ విభేదాలు వెళ్లాయి. డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఒబేదుల్లా కొత్వాల్ ఆదివారం మధ్యాహ్నం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది.

ఎంపీ మందా ప్రసంగిస్తూ పరకాలలో పార్టీ ఓటమిని పరోక్షంగా ప్రస్తావించారు. తెలంగాణపై ఇచ్చిన మాటను పార్టీ నిలబెట్టుకోదేమోనన్న అనుమానం ప్రజల్లో ఉందని వ్యాఖ్యానిస్తుండగా, ఒక్కసారిగా గొడవ ప్రారంభమైంది. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయనపై విరుచుకుపడ్డారు. కొల్లాపూర్ ఉప ఎన్నికలప్పుడు ఎందుకు ప్రచారం చేయలేదంటూ నిలదీశారు. తెరాసకు అమ్ముడుపోయావంటూ నిలదీశారు. దీనిపై మందా ఎదురుదాడికి దిగారు. లొల్లి చేస్తే తాను భయపడేవాడిని కాదని స్పష్టంచేశారు.

మందాకు మద్దతుగా కొంతమంది వేదిక వద్దకు వెళ్లగా, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఒక కార్యకర్తను అడ్డుకున్నారు. దీంతో మందా మరింత సీరియస్‌గా స్పందించారు. దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెబుతూ, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు వేదికపైకి కుర్చీలు విసిరారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి అరుణ, ఎంపీ మందాలను సురక్షితంగా పక్కకు పంపారు. అనంతరం మందా మీడియాతో మాట్లాడారు. అరుణపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
డీకే అరుణ దళిత వ్యతిరేకి అని, కావాలనే తనపై దాడి చేశారని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అరుణను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అనంతరం ఎస్పీని కలిసి మంత్రి అరుణతో సహా పలువురిపై ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. కాగా, మందాకు తనపై ప్రత్యేక కక్ష ఉందని, అది ఎందుకో తెలియదని మంత్రి అరుణ అన్నారు.

కిందటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత నుంచే తనపై ఆయన తరచూ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మహిళా మంత్రిగా ఉండే అర్హత తనకు లేదా అని నిలదీశారు. మందా జగన్నాథం చేస్తున్న విమర్శలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. దళిత ఎంపీగా ఆయనను ఎప్పుడూ గౌరవిస్తునే ఉన్నానని, తనపై దళిత వ్యతిరేకి అన్న ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని డికె అరుణ అన్నారు.

కామెంట్‌లు లేవు: