19 జూన్, 2012

జగన్‌కు భిన్నంగా బాబు: బాలయ్య, జూనియర్‌లే ఉంటే..




















ఉప ఎన్నికలలో నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టడం కూడా తెలుగుదేశం పార్టీ కొంప ముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి ఘోర పరాజయం చవిచూసింది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పదిహేను స్థానాలలో గెలుపొందగా, కాంగ్రెసు రెండు స్థానాలను కైవసం చేసుకొని పరువు నిలుపుకుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలవకుండా పరువు పోగొట్టుకుంది.

గత మూడేళ్లుగా జరుగుతున్న ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ఉంటే 2014లో పార్టీ అధికారం కైవసం చేసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఇందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని కూడా కొందరు తప్పు పడుతున్నారని అంటున్నారు. నందమూరి హీరోలూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను ఉప ఎన్నికలలో ఉపయోగించుకోవడం పార్టీని తీవ్రంగా దెబ్బ తీసిందని అంటున్నారు.

ఉప ఎన్నికలలో వారిని రంగంలోకి దింపక పోవడం వల్ల నందమూరి - నారా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చిందని, ఇది ఉప ఎన్నికలలో దెబ్బ తీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రౌడ్ పుల్లర్స్ అయిన బాలయ్య, జూనియర్ల సేవలు వినియోగించుకుంటే బావుండేదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలకు ముందు బాలయ్య పార్టీకి అవసరమైనప్పుడు తన సేవలు తప్పకుండా అందిస్తానని చెప్పారు. ఆయన మొదటి నుండి అదే విషయాన్ని చెబుతున్నారు.

విభేదాలు ఉన్నాయనే మాట ఉన్నప్పటికీ జూనియర్ కూడా పార్టీకి అవసరమైనప్పుడు తాను వెళతానని చెప్పారు. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు వారిని ఉప ఎన్నికల ప్రచారానికి పిలిస్తే బావుండేదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యాఖ్యలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా తానొక్కడే ప్రచారం చేయడం వల్లనే ఫలితాలు పూర్తి నిరాశపర్చే విధంగా ఉన్నాయని అంటున్నారు.

2014 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు తమ పార్టీల తరఫున హేమాహేమీలను రంగంలోకి దింపింది. కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు మాత్రమే కాకుండా కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి ప్రచారం చేశారు. చివరకు స్టార్ కంపెయినర్ అయిన చిరంజీవిచే కూడా ప్రచారం చేయించారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున తొలత జగన్ ఒక్కడే రంగంలోకి దిగినప్పటికీ అతని అరెస్టు తర్వాత షర్మిల, విజయమ్మలు జోరుగా ప్రచారం చేశారు.

సానుభూతి పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలో జగన్ పార్టీ తరఫున పెద్దగా ప్రచారం చేయకున్నా గెలిచేవారే. కానీ జగన్ మాత్రం మెజార్టీ లక్ష్యంగా తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించాడు. చివరకు ఆఖరి అస్త్రంగా భావిస్తున్న వైయస్ విజయమ్మను కూడా ప్రచారంలోకి దింపారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో పాటు తదితరులు ఇదే చెప్పారు. జగన్ 2014కు ఉపయోగించాల్సిన ఆఖరి అస్త్రం(విజయమ్మ)ను ఇప్పుడే వినియోగించారని, ఇక ముందు ముందు ఆయనకు ఏ అస్త్రాలు లేకుండా పోయాయని చెప్పారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు ఇలా హేమాహేమీలతో ప్రచార రంగంలోకి దిగితే.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని అంటున్నారు. సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికలలో ఒకటో రెండో సీట్లు టిడిపి గెలుచుకున్నా పార్టీ పటిష్టంగా ఉందనే పరిశీలకులు భావించేవారని.. కానీ ఒక్క సీటు గెలవక పోవడం వల్ల ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలలో చంద్రబాబు ఒంటెత్తు పోకడలకు వెళ్లకుండా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను రంగంలోకి దింపి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే నందమూరి కుటుంబాన్ని రంగంలోకి దింపాల్సినంత ఇంపార్టెన్స్ ఉప ఎన్నికలకు లేదని టిడిపిలోని మరికొన్ని వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు. అయితే వారిని దింపాల్సినంద ఇంపార్టెన్స్ ఉన్నా లేకున్నా ప్రతిష్టాత్మకమైన పోరులో పరువు కోసం వారిచే ప్రచారం చేయిస్తేనే బాగుండేదని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: