19 జూన్, 2012

వివాహేతర సంబంధం: కూతురిని నరికి చంపిన తండ్రి





















ఓ తండ్రి కన్న కూతురిని దారుణంగా నరికివేసి ఆ తర్వాత ఓ చేత్తో ఆమె తలను, మరో చేత్తో కత్తిని పట్టుకొని ఊరంతా కలియ తిరిగిన సంఘటన రాజస్థాన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లైన తన కుమార్తె పలువురితో వివాహేతర సంబంధం నెరపడంపై ఆ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమెను కత్తితో నరికి వేసి మట్టుబెట్టాడు.

రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలోని ఇరవయ్యేళ్ల యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమె గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుమార్తె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ తండ్రి చార్‌భుజ ప్రాంతంలోని దుంజెర్రీ కా గూడ గ్రామంలోని ఇంట్లో ఉన్న కుమార్తె తలను కత్తితో నరికి చంపాడు.

అనంతరం తలను ఓ చేత్తో, కత్తిని మరో చేత్తో పట్టుకొని ఊరంతా తిరిగాడు. ఆ తర్వాత అతను కెల్వా పోలీసు స్టేషన్ పరిధిలోని గోమ్టి పోలీసు అవుట్ పోస్టులో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తండ్రి ఓ మార్బుల్ క్వారీలో పని చేస్తున్నాడు. అతని భార్య పొలాల్లో పని చేస్తుంటుంది. ఈ ఘటన జరిగినప్పుడు తల్లి లేదని తెలుస్తోంది.

ఈ ఘటన జరిగిన ప్రాంతం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ టీచర్ విద్యార్థిని సోమవారం కత్తితో పొడిచింది. ఈ ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తరగతి గదిలో అల్లరి చేశాడని టీచర్ ఈ ఘాతుకానికి పాల్పడింది. విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కామెంట్‌లు లేవు: