19 జూన్, 2012

'గాలి'కి బెయిల్ కేసు: పట్టాభిరామారావ్ అరెస్ట్, విచారణ




















హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో మెయిన్ వికెట్‌ను అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. గాలికి బెయిల్ ఇచ్చేందుకు కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నట్లు పట్టాభి రామారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడు. మంగళవారం ఉదయం ఎసిబి అధికారులు ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు.

అతనిని అక్కడి నుండి నేరుగా మొజాంజాహీ మార్కెట్ వద్దనున్న ఎసిబి కార్యాలయానికి తీసుకు వచ్చారు. అక్కడ ఆయనను విచారిస్తున్నారు. బెయిల్ ఫర్ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారు, ఎలా డబ్బులు తీసుకున్నారు, మొత్తం ఇచ్చింది ఎంత తదితర అంశాలపై పట్టాభి రామా రావు నుండి ఎసిబి అధికారులు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో ఇప్పటికే రిటైర్డ్ జడ్జి చలపతి రావు, పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను ఎసిబి గతంలోనే అరెస్టు చేసింది.

కాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి టి. పట్టాభి రామారావుపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు గురువారం ఆయనను సస్పెండ్ చేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డికి హైదరాబాదులోని సిబిఐ కేసుల మొదటి అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి. పట్టాభి రామారావు మే 12వ తేదీన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో సిబిఐ ఫిర్యాదు మేరకు హైకోర్టు పట్టాభిరామారావును సస్సెండ్ చేసింది. న్యాయమూర్తికి చెందిన బ్యాంకు లాకర్లను కూడా సోదా చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కనుగొన్నారు. సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలైనా కాకమునుపే పట్టాభి రామారావు అవినీతి బాగోతం బయటపడడం గమనార్హం.

కామెంట్‌లు లేవు: