17 జులై, 2012

100కు 50 ఇచ్చారు: జగన్ పార్టీ నేత, సిఎంకు సూచన



















హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి ఆదివారం మండిపడ్డారు. కిరణ్ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇందిరమ్మ బాటను ఎందుకోసం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా మంచి పథకాలు తెస్తానని చెప్పిన సిఎం మాటల్లో కాకుండా చేతలలో చూపించాలన్నారు.

రాష్ట్రంలోని విద్యుత్, రైతు సమస్యల పైన ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును ప్రజలు నమ్మె స్థితి లేదన్నారు. గతంలో బిసిలకు వంద సీట్లు ఇస్తానని చెప్పిన బాబు 2009 ఎన్నికలలో 50 మాత్రమే ఇచ్చారని విమర్శించారు.

ఇప్పుడు కూడా చంద్రబాబు తన మాట నిలుపుకుంటారనే నమ్మకం లేదన్నారు. జూలై 19న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతివ్వాలా లేక ఎన్డీయే అభ్యర్థి పిఏ సంగ్మాకు మద్దతివ్వాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ప్రణబ్, సంగ్మా ఇద్దరూ తమ పార్టీతో మాట్లాడి మద్దతు ఇవ్వాలని కోరారని చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు జనాకర్షణ పోయిందన్నారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేనేత కార్మికుల కోసం సిరిసిల్లలో దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి భయమెందుకని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు.

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని విడుదల చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గౌతం రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు విజయవాడ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రభాకర రావు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: